సన్నాలు సపరేట్..అక్టోబర్ నుంచే కొనుగోళ్లు

సన్నాలు సపరేట్..అక్టోబర్ నుంచే కొనుగోళ్లు
  • వడ్ల కొనుగోళ్లకు యంత్రాంగం సన్నద్దం
  • వచ్చే నెల నుంచి కొనుగోళ్లు
  • సన్నాలు.. దొడ్డు రకం వేర్వేరుగా కొనుగోళ్లు
  • సన్నాలు కేటాయించిన మిల్లులకు జియో ట్యాగింగ్​

యాదాద్రి/ సూర్యాపేట/ నల్గొండ అర్బన్, వెలుగు: వానాకాలం వడ్ల కొనుగోళ్లపై జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. వచ్చే నెల నుంచి కొనుగోలు సెంటర్లు ప్రారంభించనున్నారు. అవసరమైన గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, తేమ మీటర్లు, ప్యాడి క్లీనర్లను రెడీ చేసుకుంటున్నారు. వచ్చే ఏడాది నుంచి రేషన్​షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈసారి సెంటర్లలో దొడ్డు, సన్న రకాలను వేర్వేరుగా కొనుగోలు చేయనున్నారు.

యాదాద్రిలో 4 లక్షల టన్నులు

యాదాద్రి జిల్లాలో గత సీజన్​ కంటే ఈసారి వరి సాగు కొంత తగ్గింది. గత వానాకాలం సీజన్​లో 3.05 లక్షల ఎకరాల వరకూ సాగు చేశారు. ఈసారి సకాలంలో వానలు కురువపోవడంతో 2.87 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇందులో దొడ్డు రకం 2.50 లక్షల ఎకరాల్లో సాగు చేస్తుండగా, సన్న వైరైటీలను 35 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు.

మొత్తంగా 6.25 టన్నుల దిగుబడికి గాను సన్నాలు 75 వేల టన్నులు దిగుబడి రావచ్చొని అంచనా. దొడ్డు రకం 5.50 లక్షల టన్నులు రానుంది. రైతుల తిండి అవసరాలు, బయట మార్కెట్లో అమ్మకాలు పోనూ 4 లక్షల టన్నులు కొనుగోలు సెంటర్లకు వచ్చే అవకాశాలున్నాయని జిల్లా యంత్రాంగం చెబుతోంది. జిల్లాలో 323 కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు.

 నల్గొండలో 7.50 లక్షల టన్నులు

నల్గొండ జిల్లాలో 5.10 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేశారు. ఇందులో సన్న రకం 2.68 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, దొడ్డు రకం 2.41 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. మొత్తంగా 12.24 లక్షల టన్నుల వడ్ల దిగుబడి వస్తుందని అగ్రికల్చర్​ ఆఫీసర్లు అంచనా వేశారు. ఇందులో సన్నాలు 6,45,084 టన్నులు, దొడ్డు రకం 5,79,384 టన్నుల దిగుబడి రానుంది.  రైతుల తిండి అవసరాలు, బయట మార్కెట్లో అమ్మకాలు పోనూ 7.50 లక్షల టన్నులు కొనుగోలు సెంటర్లకు రానుంది. ఇక్కడ మొత్తం 375 సెంటర్లు ఏర్పాటు చేసే అవకాశముంది.


సూర్యాపేటలో జిల్లాలో 3.98 లక్షల ఎకరాల్లో సాగు చేయగా. వీటిలో 2.58 ఎకరాల్లో సన్న రకం, 1.39 లక్షల ఎకరాల్లో డొద్దురకం సాగు చేశారు. 10.23 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ లెక్కన 6.28 లక్షల టన్నుల సన్న రకం, 3.94 లక్షల టన్నుల దొడ్డు రకం దిగుబడి రానుంది. రైతుల అవసరాలు, వ్యాపారులు కొనుగోలు చేయగా, 3,70, 226 టన్నుల వడ్లు సెంటర్లకు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక జిల్లాలో 206 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 

గింజ పొడవు, వెడల్పును పరిశీలించి..​ 

వచ్చే ఏడాది జనవరి నుంచి రేషన్​ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఈ సీజన్ నుంచే క్వింటా సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తోంది. దొడ్డు రకంలో గ్రేడ్​ ఏకు రూ.2320, కామన్​ వైరేటీకి రూ. 2300 ఇవ్వనుంది.

33 సన్నాలను గుర్తించి ఆ రకాలకు బోనస్​తో కలుపుకొని రూ. 2820 అందించనుంది. 33 రకాల్లో బీపీటీ 5204, ఆర్​ఎన్​ఆర్​ 15048, హెచ్​ఎంటీ సోనా, జై శ్రీరాం వంటి రకాలు ఉన్నాయి. అయితే, గింజ పొడవు, వెడల్పును పరిశీలించి ఈ సన్న రకాలను  మైక్రో మీటర్​ ద్వారా గుర్తిస్తామని అధికారులు చెబుతున్నారు. బోనస్​ ఇస్తున్నందున ఈ సీజన్​లో సన్నాలను సపరేట్​గా కొనుగోలు చేయనుంది. ఇందుకోసం సెంటర్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారా? లేదా ప్రతి సెంటర్​లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తారా? అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ వడ్లను కేటాయించే కొన్ని మిల్లులకు జియో ట్యాగింగ్​ చేయనున్నారు. 

వడ్ల కొనుగోళ్లకు రెడీగా ఉన్నాం

వచ్చే నెలలో కొనుగోళ్లు ప్రారంభిస్తాం. ఇందుకోసం అవసరమైన  చర్యలు తీసుకుంటున్నాం. గన్నీ బ్యాగులకు సంబంధించి ఇప్పటికే ఇండెంట్​పెట్టాం. టార్పాలిన్లు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. మిల్లుల కెపాసిటీకి అనుగుణంగా కేటాయింపులు జరపుతాం. డిఫాల్ట్​ మిల్లులకు సీఎంఆర్​ కేటాయింపులు చేయం. – జగదీశ్, డీఎం, సివిల్​సప్లై, యాదాద్రి