గద్వాల, వెలుగు: లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని జిల్లా జడ్జి కుషా సూచించారు. శనివారం కోర్టు ఆవరణలో పోలీస్ ఆఫీసర్లతో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ వచ్చే నెల 9న కోర్టు ఆవరణలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కరించాలని ఆదేశించారు.
క్రిమినల్ కాంపౌండింగ్ కేసులను గుర్తించి ఇరు వర్గాలకు నచ్చజెప్పి రాజీ పడేలా చూడాలని సూచించారు. న్యాయమూర్తులు అనిరోజ్ క్రిస్టియన్, గంటా కవితా దేవి, ఉదయ్ నాయక్, డీఎస్పీ సత్యనారాయణ పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్ టౌన్: పెండింగ్ కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ను వినియోగించుకోవాలని జిల్లా జడ్జి రాజేశ్‌బాబు సూచించారు. జిల్లా కోర్టులో న్యాయమూర్తులు, పీపీలు, పోలీస్ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 13,919 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిలో సివిల్, క్రిమినల్, మనీ రికవరీ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని కోరారు.
కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ న్యాయమూర్తులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. న్యాయమూర్తులు సబిత, కె మమతా రెడ్డి, పి మౌనిక, అడిషనల్ ఎస్పీ రామేశ్వర్, డీఎస్పీలు పాల్గొన్నారు.