
దుబ్బాక, వెలుగు: సుప్రీం కోర్టు సూచనల మేరకు అత్యాధునిక పద్ధతిలో దుబ్బాకలో కోర్టు నిర్మాణం చేస్తామని జిల్లా జడ్జి సాయి రమాదేవి, కలెక్టర్ మనుచౌదరి తెలిపారు. శుక్రవారం దుబ్బాక పట్టణంలో కొత్తగా కోర్టు కాంప్లెక్స్ నిర్మించడానికి స్థలాన్ని కలెక్టర్ తో కలిసి జడ్జి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు కమిటీ సూచన మేరకు కోర్టు కాంప్లెక్స్ కి 4 ఎకరాల స్థలం ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా న్యాయ, రెవెన్యూ, మున్సిపల్, ఆర్ అండ్ బీ అధికారులు ఇదివరకు కేటాయించిన 1. 32 ఎకరాల స్థలం చుట్టూ ఉన్న ప్రభుత్వ భవనాలను ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి తరలించి కోర్టుకు అనుకూలమైన స్థలాన్ని అప్పజెప్పడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రెవెన్యూ సర్వే అధికారులు దీనికి సంబంధించిన మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. ఆర్ అండ్ బీ శాఖ సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే కోర్టు కాంప్లెక్స్ డిజైన్ ను రూపొందించాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ పట్టణంలోని పాత తహసీల్దార్ ఆఫీసును, ఐవోసి భవనాన్ని పరిశీలించారు. ఖాళీగా ఉన్న గదుల్లో ఇతర ఆఫీసులను కేటాయించేందుకు అధికారులతో చర్చించాలని తహసీల్దార్ సంజీవ్ ని ఆదేశించారు. వారి వెంట ఆర్డీవో సదానందం, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో భాస్కర శర్మ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.