ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

కరీంనగర్ టౌన్, వెలుగు: జిల్లాలోని కొత్తపల్లి అల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్ లో సోమవారం జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అల్ఫోర్స్ స్కూల్ నిర్వాహకులు వి.మల్లారెడ్డితో కలిసి చైర్మన్ నరేందర్ రెడ్డి  మాట్లాడారు. క్రీడలతో మానసిక ఉల్లాసంతోపాటు రోజువారీ  పనుల్లో కలిగే  ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరు వివిధ క్రీడల గురించి తెలుసుకోవాలని అన్నారు. జాతీయ స్థాయిలో రాణించిన టి.చికీతరావు,ఆర్. ధీరజ్ రావును సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ ,స్నేహాలత, టీచర్స్, స్టూడెంట్స్ పాల్గొన్నారు . 

పద్మశాలీ సంఘం మండలాధ్యక్షుడిగా రాజేశం 

జమ్మికుంట, వెలుగు : మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా నూకల రాజేశం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సిరిమల్లె జయేందర్ అన్నారు. సోమవారం పట్టణంలోని పద్మశాలి భవనంలో మండల స్థాయి కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాజేశం మాట్లాడుతూ మండలంలోని
 పద్మశాలీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, తన నియమాకానికి సహాకరించిన జిల్లా కార్యదర్శి కృష్ణహరి, ఉపాధ్యక్షుడు సరిమల్లె జయేందర్, కోశాధికారి భద్రయ్య, ప్రచార కార్యదర్శి చిలుక నర్సన్న, సంఘం మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు అరుకాల వీరేశలింగంకు, తన కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శిగా బిట్ల రాజేందర్​, కోశాధికారిగా శ్యామంతుల మల్లేశం, ఉపాధ్యక్షుడిగా ఉడుత నర్సింహస్వామి, 12 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం అధ్యక్షుడిని, కార్యవర్గాన్నిసన్మానించారు.

సర్పంచ్ ది సర్కార్ హత్యే:కాంగ్రెస్​ నేత జువ్వాడి కృష్ణారావు
కోరుట్ల,వెలుగు: ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపూర్ కు చెందిన సర్పంచ్ సంతోష్  ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ సీనియర్ నేత జువ్వాడి కృష్ణారావు అన్నారు. సోమవారం కోరుట్లలో ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ అని చెప్పే సీఎం జీపీ పరిధిలో చేసిన పనులకు ఎందుకు బిల్లులు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాక  కేసీఆర్ చేసిన అప్పులకు గ్రామాల్లో సర్పంచ్ లు బలి అవుతున్నారని అన్నారు. సర్పంచ్ కుటుంబానికి రూ. కోటి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కృష్ణారావు డిమాండ్​ చేశారు.

బిల్లులు రానందుకే..
మెట్ పల్లి, వెలుగు : గ్రామ పంచాయతీలో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులు సర్కారు చెల్లించకపోవడంతోనే ఇబ్రహీంపట్నం మండలం ములరాంపూర్ సర్పంచ్​సుంచు సంతోష్  ఆత్మహత్య చేసుకున్నాడని మెట్ పల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎ.మహేందర్ రెడ్డి ఆరోపించారు. సోమవారం బిల్లులు వెంటనే చెల్లించాలని సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు. అనంతరం ఆఫీస్ ఉద్యోగికి వినతిపత్రం అందజేశారు. సర్పంచులు అప్పు చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడితే ఏడాదిగా సర్కారు బిల్లులు ఇవ్వడంలేదని అన్నారు. కార్యక్రమంలో మెట్ పల్లి, ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ మండలాధ్యక్షులు అంజిరెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి 

పెద్దపల్లి, వెలుగు: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ సంగీత అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్​పలు ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం మాట్లాడారు. మొత్తం 33 దరఖాస్తులు వచ్చాయని, అందులో పెన్షన్ మంజూరు కోరుతూ, ఉపాధి కల్పించాలని, భూ సంబంధిత సమస్యలపై ఎక్కువగా అర్జీలు వచ్చాయన్నారు.

నిరసనలతో హోరెత్తిన కలెక్టరేట్..
కరీంనగర్ సిటీ: తమకు దళితబంధు వర్తింపజేయాలని సోమవారం ప్రజావాణికి వచ్చిన బాధితులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. అలాగే నగరంలోని సీతారాంపూర్ లో సర్వే నంబర్ 68/డీ లో నిర్మించుకుంటున్న మూడు ఇళ్లను కూల్చి వేసిన కార్పొరేటర్ జంగలి సాగర్ పై చర్యలు తీసుకోవాలని కె. సతీశ్, కె.హరీశ్, కె. వంశీ కలెక్టర్ ఫిర్యాదు చేశారు. గతంలో సర్పంచ్​గా ఉన్న సాగర్ అనుమతికోసం రూ.10 లక్షలు డిమాండ్ చేయగా వాయిదా వేసుకున్నామని తెలిపారు. 13న ఇళ్లను కూల్చివేశారని, రూ.50 లక్షలు నష్టం జరిగిందన్నారు.

పంచాయతీ అవార్డులకు పోటీ పడాలి  
రాజన్న సిరిసిల్ల: సమస్యలు పరిష్కరించాలని ప్రజావాణిలో 36 దరఖాస్తులు వచ్చినట్లు సిరిసిల్ల కలెక్టర్​అనురాగ్ జయంతి తెలిపారు. ప్రజావాణిలో నడవలేని వృద్ధ దంపతుల దగ్గరికి వెళ్లిన కలెక్టర్ వారి వద్ద వినతి పత్రాన్ని స్వీకరించారు. దంపతులకు సత్వర న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా జీపీలకు ఏటా ఇచ్చే అవార్డులకు జిల్లాలోని 255 పంచాయతీలు పోటీ పడాలన్నారు.   

గాంధీ భవన్​లో ఓటు వేసిన సిరిసిల్ల లీడర్లు
రాజన్న సిరిసిల్ల, వెలుగు: ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా సిరిసిల్ల జిల్లాకు చెందిన కాంగ్రెస్​ లీడర్లు సోమవారం హైదరాబాద్ గాంధీ భవన్​లో ఓటు వేశారు. వారిలో డీసీసీ ప్రెసిడెంట్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ చార్జి కేకే మహేందర్ రెడ్డి, వేములవాడ ఇన్ చార్జి ఆది శ్రీనివాస్ ఉన్నారు.

మద్యం బాటిల్స్ దొంగల అరెస్ట్
సుల్తానాబాద్, వెలుగు: పట్టణంలోని దావత్ వైన్స్, గర్రెపల్లి శివారులోని మరో వైన్స్ లో చోరీలకు పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేసినట్టు సీఐ ఇంద్రసేనారెడ్డి సోమవారం తెలిపారు. ఇటీవల ఆయా షాపుల్లో వెనుక నుంచి చొరబడి మద్యం బాటిల్స్ ను చోరీ చేశారని చెప్పారు. శాస్త్రి నగర్ కు చెందిన సాయికిరణ్, మరో బాలుడిని అరెస్టు చేసి వారి నుంచి 6 బాటిల్స్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కేసులో మరో నిందితుడు రాజ్ కుమార్ పరారీలో ఉన్నట్టు పేర్కొన్నారు. 

అల్లంరబ్బ అమ్మడానికి వచ్చిపుస్తెల తాడు చోరీ
కొడిమ్యాల, వెలుగు: అల్లం రబ్బ అమ్మడానికి వచ్చిన యువకుడు పుస్తెల తాడు చోరీ చేసిన ఘటన  సోమవారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం డబ్బు తిమ్మయ్యపల్లిలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఒడ్నాల మల్లయ్య, రాజవ్వ వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నారు. వీరి కుమారుడు శ్రీనివాస్ అనారోగ్యంతో జగిత్యాల హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. సోమవారం అల్లం మురబ్బ అమ్ముతామని వచ్చిన ఓ వ్యక్తి మల్లయ్య ఇంటికి వచ్చి నీ కొడుకు ఆరోగ్యం బాగుచేస్తానని, రూ.21 వేలు ఇవ్వాలని చెప్పగా మల్లయ్య తిరస్కరించి బయటకు వెళ్లిపోయాడు. అనంతరం ఒంటరిగా ఉన్న మల్లవ్వకు మాయమాటలు చెప్పి పసుపు, బంగారం ఇస్తే కొడుకు ఆరోగ్యం బాగు చేస్తానని నమ్మించగా మల్లవ్వ మెడలోని 25 గ్రాములు పుస్తెల తాడు ఇచ్చింది. వెంటనే యువకుడు పుస్తెల తాడుతో ఉడాయించాడు. అబోదిబోమన్న మల్లవ్వ పోలీసులకు ఫిర్యాదు చేసింది.