
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న సీఎం కప్ క్రీడా పోటీలు చివరి దశకు వచ్చేశాయి. స్టేట్ లెవెల్ గేమ్స్ హైదరాబాద్‌లో ఆదివారం నుంచి నాలుగు రోజుల పాటు జరగనున్నాయి. మండల, జిల్లా స్థాయిల్లో 33 జిల్లాల నుంచి స్టేట్ లెవెల్‌కు ఎంపికైన టీమ్స్, ప్లేయర్లు నగరంలోని ఎల్బీ, గచ్చిబౌలి, సరూర్‌నగర్, యూసుఫ్‌గూడ స్టేడియాలు, జింఖానా గ్రౌండ్స్‌లో 18 క్రీడాంశాల్లో పోటీ పడనున్నారు.
టోర్నీకి అన్ని ఏర్పాట్లు చేసినట్టు శాట్స్ చైర్మన్ ఈ. ఆంజనేయ గౌడ్, క్రీడాశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు. సీఎం కప్ పోటీల నిర్వహణ ప్రారంభోత్సవ వేడుకలు, ముగింపు వేడుకలు తదితర విషయాలపై సమీక్ష నిర్వహించారు. తొలి రోజు డ్రాతో పాటు ప్రిలిమినరీ రౌండ్ పోటీలు జరుగుతాయని చెప్పారు. సోమవారం సాయంత్రం ఎల్చీ స్టేడియంలో ఓపెనింగ్ సెర్మనీ ఉంటుందని తెలిపారు.