
నిర్మల్/మంచిర్యాల, వెలుగు: ప్రతి విద్యార్థికీ ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలు తప్పనిసరయ్యాయని, జిల్లాలో ఇంగ్లిష్ భాషాభివృద్ధికి ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ (ఎల్టా) చేస్తున్న కృషి అభినందనీయమని నిర్మల్డీఈవో రామారావు అన్నారు. ఎల్టా జిల్లా అధ్యక్షులు కడార్ల రవీంద్ర అధ్యక్షతన జిల్లా స్థాయి ఇంగ్లిష్ ఒలింపియాడ్ రాత పరీక్ష, ఉపన్యాస పోటీలను స్థానిక అనుశ్రుత రిసోనెన్స్ జూనియర్ కాలేజీ ఆవరణలో నిర్వహించారు.
చీఫ్ గెస్ట్‌గా హాజరైన డీఈవో ప్రసంగించారు. ఆంగ్ల భాషాభివృద్ధికి ఎల్టా జిల్లా శాఖ విశేష కృషి చేస్తోందన్నారు. ప్రస్తుతం ఇంగ్లిష్ ఆవశ్యకత పెరిగిపోయిందని, స్టూడెంట్లు తప్పనిసరిగా పట్టుపెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జడ్జిలుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ జి.సుభాష్, ఇంగ్లిష్ భాషా నిపుణులు డాక్టర్ అఖిలేశ్ కుమార్ సింగ్, గంగన్న డేవిడ్, జిల్లా పరీక్షల అధికారి పద్మ , కేజీబీవీ సమన్వయకర్త సలోమి కరుణ, ఎల్టా ప్రధాన కార్యదర్శి ఎస్.భూమన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాలలో..
మంచిర్యాలలో ఎల్టా ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ఇంగ్లిష్ ఒలింపియాడ్, ఎలొక్యుషన్ పోటీలు నిర్వహించారు. జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో నిర్వహించిన పోటీలకు చీఫ్ గెస్ట్‌గా డీఈవో యాదయ్య హాజరయ్యారు. టెన్త్ విద్యార్థుల కోసం తయారుచేసిన ఇంగ్లిష్ స్పెషల్ క్లాస్ ప్రాక్టీస్ బుక్ ను విడుదల చేశారు. ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు. ఎల్టా రాష్ట్ర సమన్వయకర్త సి.బాబ్జి, ప్రధాన కార్యదర్శి ఎం.విజయలక్ష్మి, మండల కన్వీనర్సు, గైడ్ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు..