దారి మళ్లిన మినరల్‌‌ ఫండ్‌‌ .. ఎన్నికల ముందు హడావిడిగా కేటాయింపు

  • రూల్స్‌‌కు విరుద్ధంగా వ్యవహరించిన ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు  
  • ఫండ్‌‌‌‌ కింద మంజూరైన అసలు పనులు మాత్రం పెండింగ్

సూర్యాపేట, వెలుగు:  సూర్యాపేటలో డిస్ట్రిక్‌‌‌‌ మినరల్‌‌‌‌ ఫండ్‌‌‌‌ ట్రస్ట్‌‌‌‌(డీఎంఎఫ్‌‌‌‌టీ) ఫండ్స్‌‌ను దారి మళ్లించారు. గనులు, పరిశ్రమల నుంచి సీనరేజ్‌‌‌‌ రూపంలో వస్తున్న ఈ నిధులను వాటి ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేయాలి.  కానీ, ప్రభుత్వం నుంచి జనరల్ ఫండ్ రాకపోవడంతో ప్రజాప్రతినిధులు ఈ నిధులను ఇష్టారీతిగా వాడుకున్నారు.  ఎన్నికలకు ముందు హడావిడిగా తమకు ఇష్టం వచ్చిన పనులకు  కేటాయించారు. నిబంధనలు పాటించాల్సిన అధికారులు సైతం వాళ్లు చెప్పినట్లే విన్నారు. 

 జగదీశ్‌‌‌‌రెడ్డి చైర్మన్‌‌‌‌గా ఉండడంతో.. 

జిల్లాలో డీఎంఎఫ్‌‌‌‌టీకి మాజీ మంత్రి జగదీశ్‌‌‌‌ రెడ్డి చైర్మన్‌‌‌‌గా వ్యవహరించారు. దీంతో కొందరు ప్రజాప్రతినిధులు పైరవీలు చేయించుకొని పనుల కోసం నిధులను మంజూరు చేయించుకున్నారు. వైకుంఠధామాలకు విద్యుత్‌‌‌‌ సరఫరా, పల్లె ప్రకృతి వనాలకు మొక్కల పంపిణీ, హరితహారం కార్యక్రమానికి మొక్కల కొనుగోలు, రైతు వేదికల్లో మిగిలిన పనుల పూర్తికి సైతం ఈ ఫండ్‌‌‌‌నే వినియోగించారు.

 లింగమంతులస్వామి జాతర పనులు, రోడ్ల వెంట బస్‌‌‌‌షెల్టర్ల నిర్మాణాలు,  మున్సిపాలిటీలో రూప్‌‌‌‌ టాప్‌‌‌‌ గార్డెన్ల ఏర్పాటుకు కూడా ఈ నిధులే ఖర్చు చేశారు. వీటితో పాటు ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులు,  జాబ్‌‌‌‌ మేళాలు, పోటీ పరీక్షలకు స్టడీ మెటీరియల్స్, నాటక ప్రదర్శనలకు సైతం  ఈ ఫండ్‌‌‌‌నే వాడారు. పార్టీ మారిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి రూ.5లక్షలు కూడా ఇందులో నుంచే ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.