గోదారి చెంతనే ఉన్నా..గొంతెండుతోంది..!

తాగునీటి తిప్పలను తీర్చని మిషన్​ భగీరథ
పట్టని గిరిపుత్రుల కష్టాలు
నిధులు రావడంలేదంటున్న ప్రజాప్రతినిధులు

భద్రాచలం, వెలుగు : నిత్యం గలగల పారే గోదారమ్మ చెంతనే ఉన్నా జిల్లాలోని మన్యం ప్రాంతంలో గల గిరిపల్లెల ప్రజలకు తాగునీరు అందక గొంతెండుతోంది. జనాలు తాగునీటి కోసం రోజూ తిప్పలు పడుతున్నా జిల్లా ఆఫీసర్లకు పట్టించుకోవడంలేదు. కోట్లాది నిధులతో నిర్మించిన పథకం ఉండి కూడా గుక్కెడు నీటి కోసం గిరిపుత్రులు పుట్టెడు కష్టాలు పడుతున్నారు. రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్​ భగీరథ కూడా వారి తాగునీటి అవసరాలు తీర్చలేకపోతోంది. ఖమ్మం జిల్లాలో రూ.2250 కోట్ల వ్యయంతో ప్రతీ ఇంటికి 100 లీటర్ల నీటిని ఇస్తున్నామన్న పాలకుల ప్రకటనలు నీటి రాతలేనని తేలిపోయింది. జిల్లాలోని చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని ఛత్తీస్​ఘఢ్ కు సరిహద్దున ఉన్న మారుమూల ఆదివాసీ గుంపులకు తాగునీరు అందడం లేదు. మిషన్​భగీరథలో భాగంగా పైపులైన్లు ధ్వంసమై నీరు రాక ఓవర్​హెడ్​ట్యాంకులు, ట్యాపులు నిరుపయోగంగా మిగిలాయి. 

రోడ్ల నిర్మాణంతో పైపులైన్లు ధ్వంసం..

దుమ్ముగూడెం మండలం ములకపాడు క్రాస్​రోడ్డు నుంచి ఆంధ్రాలోని లక్ష్మీపురం వరకు రూ.20 కోట్లతో 22 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం జరుగుతోంది. రోడ్డు వెడల్పు చేసే క్రమంలో మిషన్​భగీరథ పైపులైన్లు ధ్వంసమయ్యాయి. దీంతో ఈ మార్గంలోని మారాయిగూడెం, లచ్చిగూడెం, ఆర్లగూడెం, మహదేవపురం తదితర గ్రామ పంచాయతీల్లో నీటి సరఫరా నిలిచిపోయింది. అటు చర్ల మండలంలోని తిప్పాపురం, కుర్నపల్లి, బత్తినపల్లి తదితర గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి. మరోవైపు మారాయిగూడెంలో రెండేళ్లుగా మిషన్​భగీరథ ట్యాంకుకు నీటి సరఫరా లేదు. ట్యాపులన్నీ ఇప్పటికే పాడైపోయాయి. ఈ గ్రామంలో ఇప్పటివరకు పంచాయతీ పైపులైన్​ద్వారా బావి నుంచి నీటిని సరఫరా చేసేవారు. భగీరథ పైపులైన్​నిర్మాణ సమయంలో పంచాయతీ పైపులు కూడా ధ్వంసమయ్యాయి. దీంతో ఇప్పుడు అది కూడా పనిచేయడం లేదు. ఆర్లగూడెం పంచాయతీలో పాత పంచాయతీ పైపులైన్​ను మరమ్మతులు చేసుకుని నీటిని గిరిజనులకు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదే మండలంలోని పౌలూరిపేట, నారాయణరావుపేట తదితర గ్రామాలకు కూడా భగీరథ నీళ్లు రావడం లేదు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడంలేదు. రానున్న రోజుల్లో ఎండలు ముదిరితే తమ తాగునీటి కష్టాలు మరింత పెరుగుతాయని గిరిజనులు అంటున్నారు. 

నిధులు కూడా లేవు...

మా పంచాయతీలో రెండేళ్ల నుంచి మిషన్​భగీరథ నీళ్లు రావడం లేదు. భీమవరం, పత్తిపాక, జిన్నెగట్టు గ్రామాలకు కూడా నీళ్లు లేవు. పంచాయతీ ద్వారా బావి నుంచి పైపులతో నీటిని పుష్కలంగా ఇచ్చేవాళ్లం. భగీరథ వచ్చిందని ఆ పైపులైన్లు తీసేశారు. ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడైంది. కనీసం పంచాయతీకి తాగునీటి కోసం నిధులు కూడా రావట్లే. 8 నెలల నుంచి పైసా చూడలే. మా గిరిజనుల తాగునీటి కష్టాలు పట్టించుకోవట్లే.
- తోడెం తిరుపతిరావు, సర్పంచ్, మారాయిగూడెం

లీకుల మాట వాస్తవమే...

లీకులు ఏర్పడిన మాట వాస్తవమే. ప్రధాన లైన్లను గ్రిడ్​ఇంజనీర్లు చూసుకుంటున్నారు. వేసవి తాగునీటి ఎద్దడి నివారణకు సోలార్​పంపుసెట్లు, బోర్​వెల్ రిపేర్లు, కొత్తవి నిర్మించేందుకు, ఇంట్రా పైపులైన్ల రిపేర్లు తదితర వాటి కోసం నిధులకు ప్రపోజల్స్ పంపించాం.
- శ్రీనివాసరావు, డీఈ, మిషన్​భగీరథ