
- ప్రభుత్వ సెలవు రోజుల్లో వాగులు, నదుల్లో తవ్వకాలు
- ట్రిప్ ట్రాక్టర్ ఇసుకకు రూ.4 వేల నుంచి రూ.4,500 దాకా వసూలు
- పది రోజులుగా అక్రమ రవాణాపై నిఘా పెట్టిన ఆఫీసర్లు
- సీఎం రేవంత్ ఆదేశాలతో ట్రాక్టర్ల సీజ్, కేసులు నమోదు
మహబూబ్ నగర్ , వెలుగు: ఇసుక అక్రమ రవాణాపై ఆఫీసర్లు ఫోకస్ పెట్టారు. ఇందిరమ్మ ఇండ్లకు ఫ్రీ ఇసుకను సప్లై చేయాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో, అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా కలెక్టర్లు జిల్లా స్థాయిలో రెవెన్యూ, పోలీస్, మైనింగ్ డిపార్ట్మెంట్ హెచ్వోడీలతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.
సీజ్ చేసి కేసులు..
పది రోజులుగా ఆఫీసర్లు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పర్మిషన్ లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేస్తున్నారు. ఆ ట్రాక్టర్ల యజమానులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇటీవల హన్వాడ మండలం వేపూర్ గ్రామ శివారులోని వాగులో అక్రమంగా ఇసుక తరలిస్తుండగా ఒక ట్రాక్టర్ను పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. మిడ్జిల్ మండలం మున్ననూరు శివారులోని దుందుబీ వాగు నుంచి అక్రమంగా ఇసుకను నింపుకొని తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకొని కేసు పెట్టారు. నారాయణపేట జిల్లా ఊట్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ట్రాక్టర్ ను సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు.
డిమాండ్ పెరగడంతో విచ్చలవిడిగా రవాణా..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో స్థానికంగా ఇండ్లు, ఇతర నిర్మాణ రంగాల వారికి ఇసుక దొరకడం కష్టంగా మారింది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు అక్రమార్కులు రంగంలోకి దిగారు. వాగులు, వంకలు, నదీ తీర ప్రాంతాల్లో ఉన్న ఇసుకను తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇసుక తవ్వకాలపై ఎవరికి అనుమానం రాకుండా ప్లాన్ ప్రకారం ప్రభుత్వ సెలవు దినాల్లో పెద్ద మొత్తంలో తవ్వకాలు చేపడుతున్నారు.
తోడిన ఇసుకను టిప్పర్లు ద్వారా సీక్రెట్ ప్లేసులకు తరలిస్తున్నారు. అనంతరం అవసరం ఉన్న వారికి ట్రాక్టర్ చొప్పున అమ్మకాలకు చేపడుతున్నారు. అయితే డిమాండ్ ఏర్పడంతో ట్రాక్టర్ ట్రిప్ రేటును కూడా పెంచారు. గతేడాది వరకు ఒక ట్రిప్ ట్రాక్టర్ ఇసుక కోసం రూ.3 వేల నుంచి రూ.3,500 వరకు వసూలు చేసిన వ్యాపారులు.. ప్రస్తుతం రూ.4 వేల నుంచి రూ.4,500లకు పెంచారు.
ఫిల్టర్ ఇసుకపై పట్టింపేది?
ఇసుకకు డిమాండ్ ఏర్పడటంతో కొందరు ఫిల్టర్ ఇసుక దందాకు తెరలేపుతున్నారు. కొద్ది రోజుల కిందటి వరకు పొలాల్లో మాత్రమే ఫిల్టర్ ఇసుకను తయారు చేసిన వ్యాపారులు.. ఇప్పుడు ఎర్రమట్టి గుట్టలను కూడా ఫిల్టర్ ఇసుక కోసం తవ్వుతున్నారు. అక్కడ సేకరించిన ఎర్ర మట్టిని వారి అడ్డాల వద్దకు తీసుకొచ్చుకుంటున్నారు. అక్కడ బోర్లను ఏర్పాటు చేసుకొని.. ఫిల్టర్ ఇసుకను తయారు చేస్తున్నారు. ఈ ఇసుకను నిర్మాణ రంగాల్లో వాడటం వల్ల ప్రమాదం అని తెలిసినా.. డబ్బుల కోసం అక్రమార్కులు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. ఈ వ్యవహారం అంతా బాహాటంగానే జరుగుతున్నా.. చర్యలు తీసుకోవడంలో ఆఫీసర్లు ఫెయిల్ అవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
లీడర్లు, ఆఫీసర్లపై ఆరోపణలు..
ఇసుక అక్రమ రవాణా, ఫిల్టర్ ఇసుక దందాల్లో పొలిటికల్ లీడర్లు, ఆఫీసర్ల ప్రమేయం ఉన్నట్లు ఉన్నతాధికారులకు గత కొంత కాలంగా ఫిర్యాదులు అందాయి. స్థానికంగా ఈ సమస్య పరిష్కారం కాకపోవడంతో బాధితులు సీఎం లెవల్లో కంప్లైంట్లు చేశారు. దీంతో ఆయన దీనిపై సీరియస్గా ఉన్నారు. అక్రమ రవాణాకు సహరిస్తున్న లీడర్లు, ఆఫీసర్లపై పాత్రపై విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కలెక్టర్లతో జరిగిన సమీక్షలో ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తున్న ఆఫీసర్లపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.