
వనపర్తి, వెలుగు : విద్యార్థులకు ఉపయోగపడే పీఎం శ్రీ పథకాన్ని జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదు. నిధులు మంజూరైనా వాటిని వినియోగించడం లేదు. ఎక్కువ మంది స్టూడెంట్లు ఉన్న స్కూళ్లకు మౌలిక వసతుల కల్పనతో పాటు, ఎక్స్కర్షన్, యాన్యువల్‌డే సెలబ్రేషన్స్, అడిషనల్ క్లాస్ రూమ్స్, రిపేర్స్ కోసం ఈ పథకం తెచ్చారు. దీనికింద కేంద్రం 60శాతం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 40 నిధులు వెచ్చించి ఎంపిక చేసిన స్కూళ్లలో అభివృద్ధి పనులు చేపడతారు.
రూ.3.18కోట్ల నిధులు మంజూరు
జిల్లాలో 21 స్కూళ్లను పీఎంశ్రీ పథకం కింద ఎంపిక చేశారు. వాటిలో అయిదు ప్రైమరీ స్కూళ్లు, మూడు కేజీబీవీ, మూడు సోషల్ వెల్ఫేర్ స్కూళ్లు, ఏడు జడ్పీహెచ్ఎస్, బీసీ రెసిడెన్షియల్, యూపీఎస్, మోడల్ స్కూళ్లు ఉన్నాయి. 2024–-25 విద్యాసంవత్సరానికి రూ.3,18,23,890 మంజూరు చేశారు. వీటితో అడిషనల్ క్లాస్ రూమ్స్, ఎక్స్కర్షన్స్, రిపేర్స్, సైన్స్ ల్యాబ్స్‌కు ఉపయోగించాలి.
47.47శాతమే నిధుల వినియోగం
ఈ సంవత్సరం మంజూరైన పీఎంశ్రీ నిధులలో ఈ నెల18 వరకు కేవలం 47.47శాతం నిధులనే వినియోగించుకున్నారు. ఇంకా 53శాతం నిధులను ఆర్థిక సంవత్సరం ముగిసే లోగా వినియోగించుకోవాలి. లేదంటే నిధులు వాపస్ పోతాయి. నిధులు స్కూలు నిర్వాహకుల పేర్లమీద కాకుండా పనులు చేసే థర్డ్‌పార్టీ పేరుమీద రిలీజ్ అవుతుండడంతో స్కూళ్ల నిర్వాహకులు, మేనేజ్మెంటు కమిటీలు వినియోగంపై దృష్టి పెట్టడంలేదు. థర్డ్‌పార్టీ, మేనేజ్మెంట్ కమిటీల మధ్య సమన్వయం లేకపోవడం వలన పీఎంశ్రీ నిధులు మంజూరైన పనులు నత్తనడకన సాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఎప్పటికప్పుడు పీఎంశ్రీ పనులపై రివ్యూ మీటింగులు జరిపి వెనువెంటనే పనులు జరిగేలా చూడాలని ఆదేశిస్తున్నా పనుల్లో మాత్రం వేగం పెరగడం లేదు.
షోకాజ్ నోటీసులిచ్చి చర్యలు తీసుకుంటాం
జిల్లాలో పీఎంశ్రీ పథకం కింద అభివృద్ధి పనుల్లో కొన్ని స్కూళ్లలో పనులు నెమ్మదించిన విషయం వాస్తవమే. నలభైశాతం కంటే తక్కువ నిధులు ఖర్చు చేసిన ఆయా స్కూళ్లకు నోటీసులిచ్చి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఇచ్చిన నిధుల తాలూకు అభివృద్ధి పనులు పూర్తయ్యేలా చూస్తాం.
అబ్దుల్ ఘని, జిల్లా విద్యాధికారి, వనపర్తి
నిధుల వినియోగం వివరాలు ఇలా
2 స్కూళ్లలో నూరుశాతం నిధుల వినియోగం
4 స్కూళ్లలో 90.98శాతం
4 స్కూళ్లలో 50.71
6 స్కూళ్లలో 35.48
5స్కూళ్లలో 10. 25
మొత్తం రూ.3,18,23,890 కు రూ.1,51,06,605 నిధులను ఖర్చు చేశారు. అంటే ఇది 47.47శాతం మాత్రమే.