
- 50 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న కనకగిరి కొండలు
- ఫారెస్ట్ లో చిరుతలు, ఎలుగుబంట్లు సహా 19 రకాల వన్యప్రాణులు
- కాకతీయ కాలం నాటి రెండు ఆలయాలు
- వైల్డ్ లైఫ్ సర్వే.. బర్డ్ సర్వే..
ఖమ్మం, వెలుగు : రాష్ట్రంలో ఇప్పటి వరకు అంతగా ప్రాచుర్యం పొందని పులిగుండాల అందాలను టూరిస్టులకు పరిచయం చేసేలా జిల్లా ఉన్నతాధికారులు ప్లాన్ చేస్తున్నారు. అడ్వెంచర్ టూరిజంకు కేరాఫ్ గా మార్చేలా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ట్రెక్కింగ్, సఫారీ, బర్డ్ వాచింగ్, జంగిల్ క్యాంపింగ్, బోటింగ్ లాంటి యాక్టివిటీస్‌ను సిద్ధం చేస్తున్నారు. దీని కోసం ఇప్పటికే పనులు మొదలుపెట్టారు. సఫారీ కోసం దాదాపు 20 కిలోమీటర్ల రహదారిని సిద్ధం చేశారు.
పులిగుండాల ప్రాజెక్టు నుంచి పాలపిట్ట బర్డ్ వాచ్‌టవర్, పాలకొయ్యలొద్ది, తుంగమడుగు మీదుగా పల్లెర్లబావి గుట్ట, వీరభద్రస్వామి ఆలయం, లెపర్డ్ వాచ్ టవర్, వ్యూపాయింట్ వరకు ఘాట్ రోడ్డు తరహాలో మట్టి రోడ్డును నిర్మించారు. ఈ రోడ్లపై ప్రస్తుతం ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. టూరిస్టులకు అన్ని రక్షణ ఏర్పాట్లు, ఇతర ప్రాథమిక సౌకర్యాలను కల్పించిన తర్వాత పర్యాటకులను అనుమతించనున్నారు. ప్రస్తుతానికి పులిగుండాల ప్రాజెక్టు, దాని దగ్గర నుంచి మూడున్నర కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేసి పులిగుండాల వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్లే ప్రణాళికను సిద్ధం చేశారు.
దాదాపు 50 వేల ఎకరాల్లో..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, జూలూరుపాడు, చండ్రుగొండ, ఏన్కూరు, కరకగూడెం మండలాల్లో దాదాపు 50 వేల ఎకరాల్లో కనకగిరి కొండలు విస్తరించి ఉన్నాయి. ఇందులో ఇప్పటి వరకు పదో వంతులో మాత్రమే పర్యాటకాన్ని అభివృద్ధి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అడవిలో ఉన్న వన్యప్రాణులు, పక్షులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. గత రెండు వారాలుగా హైదరాబాద్ నుంచి ప్రత్యేక వైల్డ్ లైఫ్ ఎక్స్ పర్ట్, ఎన్జీవో ప్రతినిధులు కనకగిరి కొండల్లో బర్డ్, వైల్డ్ లైఫ్ సర్వేను నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు గుర్తించిన ప్రకారం కనకగిరి కొండల్లో 14 చిరుతపులులు, 20 వరకు ఎలుగుబండ్లు, వందల సంఖ్యలో కొండగొర్రెలు, చుక్కల దుప్పులు, అడవి బర్రెలు, కణుజులు, అడవి పందులు, నక్కలు, తోడేళ్లు, ముళ్ల పందులు కలిపి మొత్తం 19 రకాల జంతు జాతులున్నాయి.
అరుదైన ప్యారడైజ్ ఫ్లై క్యాచర్, బ్లూ ఇయర్డ్ కింగ్ ఫిషర్ వంటి పక్షులతో పాటు 120 రకాల పక్షిజాతులున్నట్టు ఇప్పటి వరకు గుర్తించారు. ఇప్ప, నల్లమద్ది సహా 40కి పైగా జాతులకు సంబంధించిన వివిధ రకాల మొక్కలు, వృక్ష జాతులు ఉన్నట్టు చెబుతున్నారు. అయితే వైల్డ్ లైఫ్ సఫారీకి భవిష్యత్‌లో అనుమతించినా, ప్రస్తుతం అడవిలో ఉన్న జంతువులు టూరిస్టులకు కనిపించే అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయాలను అధికారులు ఆలోచిస్తున్నారు. సమీపంలోని సత్తుపల్లి అర్బన్ పార్క్ లో ఉన్న జింకలను తీసుకువచ్చి సఫారీ దారిలో ప్రత్యేక ఎన్ క్లోజర్ లో ఉంచే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నారు. దీని ద్వారా టూరిస్టులు, పిల్లలను ఎక్కువ మందిని ఆకర్శించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
నైట్ క్యాంప్ ల ఏర్పాటు
దూరప్రాంతాల నుంచి వచ్చే టూరిస్టులు నైట్ క్యాంప్ లను ఏర్పాటు చేసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అటవీ ప్రాంతానికి నాలుగు వైపుల నుంచి ఎంట్రన్స్ ఉండేలా ప్లాన్ చేశారు. పులిగుండాలకు సమీపంలో ఏర్పాటు చేసిన ఎంట్రన్స్ దగ్గరే ప్రత్యేకంగా కొన్ని టూరిస్ట్ గదులను నిర్మిస్తున్నారు. ప్రకృతికి దగ్గరగా ఉండేలా తాటి మొద్దులు, కొండ గడ్డి, వెదురు కర్రలతో రిసెప్షన్ సెంటర్ కమ్ క్యాంటీన్ కోసం పెద్ద గుడిసెను నిర్మించారు. ఇక టూరిస్టుల కోసం ఆర్చరీ పాయింట్, పులిగుండాల ప్రాజెక్టులో పెడల్ బోటింగ్, కయాకింగ్ లాంటివి ప్లాన్ చేస్తున్నారు. వీటితో పాటు అడవిలో ఉన్న గుళ్లు కూడా టూరిస్ట్ లను ఆకర్షిస్తాయని భావిస్తున్నారు.
లెపర్డ్ వాచ్ టవర్ సమీపంలో కాకతీయుల కాలం నాటి వీరభద్ర స్వామి ఆలయం, దాని పక్కనే రెండు కోనేర్లు ఉన్నాయి. వాటి రక్షణ కోసం పెద్ద రాళ్లతో నిర్మించిన కోట గోడలు, 16 చేతుల్లో 16 ఆయుధాలతో ఉన్న హస్తాల వీరన్న స్వామి ఆలయం ఉన్నాయి. ఇక అటవీ ప్రాంతంలో అత్యంత ఎత్తైన ప్రాంతం 2500 ఫీట్ల ఎత్తులో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి దాదాపు 1500 ఫీట్ల ఎత్తున్న కొండపై వ్యూపాయింట్ ను ఏర్పాటు చేసి, దాని దగ్గర వెదురు బొంగులతో చిన్న నిర్మాణం చేశారు. టూరిస్టులు అక్కడ ఫోటోలు దిగేలా, అంత ఎత్తుపై నుంచి చుట్టూ ఉన్న కొండలు, ప్రకృతిని ఆస్వాదించేలా ఏర్పాట్లు చేశారు.