
వరంగల్/ ఖిలా వరంగల్/ స్టేషన్‌ఘన్‌పూర్/ శాయంపేట/ నర్సింహులపేట (మరిపెడ): వెలుగు: జిల్లా ఉన్నతాధికారులు హాస్టళ్ల బాట పట్టారు. బుధవారం వరంగల్ కలెక్టర్ సత్యశారద ప్రభుత్వ ఎస్సీ కళాశాల గర్ల్స్ హాస్టల్, ఖిలా వరంగల్ అరెప్లి బుచ్చయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్భించగా, జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ చిల్పూరు మండలం కరుణాపురం మహాత్మా జ్యోతిరావుపూలే బీసీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీని సందర్శించారు. మరిపెడ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల హాస్టళ్లను మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంటక్‌రెడ్డి శాయంపేట మండలం మాందారిపేట కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేసి, సమస్యలపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు మెనూ ప్రకారం ఫుడ్ అందుతుందా, భోజనంలోని ఆహార పదార్థాలు, ఇతర విషయాలను అడిగి తెలుసుకున్నారు. స్టూడెంట్లతో మాట్లాడుతూ వారితో కలిసి భోజనం చేశారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. మందారిపేటలో భోజనం సరిగా లేకపోవడం, వసతులు సరిగా లేకపోవడంతో అడిషనల్ కలెక్టర్ అధికారులు, నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. జనగామ అడిషనల్ కలెక్టర్లు రోహిత్ సింగ్ పాలకుర్తి ఎస్సీ బాలుర హాస్టల్, పింకేశ్ కుమార్ జనగమ మండలం షామీర్పేట మైనార్టీ గురుకుల పాఠశాలను తనిఖీ చేసి, విద్యార్థులతో కలిసి భోజనం చేసి, రాత్రి అక్కడే బస చేశారు.