మరిపెడ/ కురవి/ నర్సింహులపేట, వెలుగు: మహబూబాబాద్జిల్లా మరిపెడ, డోర్నకల్, సీరోలు మండలాల్లో వరద బాధిత ప్రాంతాల్లో జిల్లా అధికారులు బుధవారం పర్యటించారు. మరిపెడ మండలం ఆకేరు వాగు వరద ప్రభావిత ప్రాంతాల్లోని ఉల్లేపల్లిలో కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ పర్యటించి రైతులకు, గ్రామస్తులకు జరిగిన నష్టాన్ని పరిశీలించి సహాయం చేయాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. డోర్నకల్, సీరోలు మండలాల్లోని ములకలపల్లిలోని 120, దుబ్బగడ్డ తండా 45, మోదుగుగడ్డ తండాలో 40 ఇండ్లకు వెళ్లి, బాధితుల స్థితిగతులు, తెలుసుకొని నిత్యావసర సరుకులు, దుప్పట్లను పంపిణీ చేశారు.
ముల్కలపల్లి- తిరుమలాయపాలెం అప్రోచ్ రోడ్డు, ముల్కలపల్లి -ఖమ్మం రోడ్డును వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను సందర్శించి, వివరాలపై ఆరా తీశారు. సర్వే చేసి నష్టంపై నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. మరిపెడ మండలం సీతారాం తండాలో ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ పర్యటించి తండావాసులతో మాట్లాడారు. వారికి కావలసిన నిత్యావసర వస్తువులు అందించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి వద్ద జరుగుతున్న రోడ్డు మరమ్మతు పనులు పరిశీలించి, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ విజయనిర్మల సీతారాం తండా, ఉల్లేపల్లి గ్రామాల్లో పర్యటించి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. 8 రెవెన్యూ గ్రామాల పరిధిలో 6500 ఎకరాల అన్ని రకాల పంటల నష్టం జరిగిందని, అగ్రికల్చర్ ఆఫీసర్లు సర్వే చేసి వివరాలు నమోదు చేయాలని సూచించారు. వారి వెంటన జిల్లా, మండలాధికారులు ఉన్నారు. నర్సింహులపేట మండలంలో పర్యటించి పంట నష్టంపై ఆరా తీశారు.