సూర్యాపేట జిల్లాలో తగ్గిన క్రైమ్..యాన్యువల్ క్రైమ్ వివరాలు : ఎస్పీ రాహుల్

సూర్యాపేట జిల్లాలో తగ్గిన క్రైమ్..యాన్యువల్ క్రైమ్ వివరాలు : ఎస్పీ రాహుల్

సూర్యాపేట, వెలుగు : జిల్లాలో 2022తో పోలిస్తే 2023లో నేరాలు తగ్గాయని ఎస్పీ రాహుల్ హెగ్డే చెప్పారు.  సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో యాన్యువల్ క్రైమ్ రివ్యూ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  నిరుడు 7100 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 7123 కేసులు నమోదయ్యాయని తెలిపారు. మహిళలకు సబంధించి  307 వేధింపుల కేసులు, 55  కేసులు అత్యాచారం , 380  మిస్సింగ్ కేసులు నమోదయ్యాయన్నారు.  మిస్సింగ్ కేసుల్లో 343 ట్రెస్‌‌‌‌ చేశామని చెప్పారు.  2022లో 90 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదవగా.. ఈయేడు 62 నమోదయ్యాయని వెల్లడించారు. 

తగ్గిన రోడ్డు ప్రమాద మరణాలు  

2022లో 502 ప్రమాదాల్లో  252 మంది మరణించగా 2023లో  514 ప్రమాదాల్లో 231 మంది మరణించారని, 471 మందికి గాయాలయినట్లు ఎస్పీ తెలిపారు.   గతేడాది 421 చోరీలు జరగగా ఈ ఏడాది 352 దొంగతనం కేసులు నమోదయ్యాయని, చోరీకి గురైన రూ. 3.63 కోట్ల సొత్తులో రూ. 1.95 కోట్లు రికవరీ చేశామని తెలిపారు. గతేడాది 26 హత్య కేసులు నమోదవగా ఈ ఏడాది 22 హత్య కేసులు నమోదు అయినట్లు పేర్కొన్నారు.

71 రేప్ కేసులు, 56 హత్యాయత్నం కేసులు నమోదు అయినట్లు తెలిపారు. పోక్సో కింద గతేడాది122 కేసులు నమోదవగా ఈ ఏడాది 93 కేసులు నమోదయ్యాయన్నారు. జిల్లాలో డయల్100కు ఏడాది 33,026  మంది ఫిర్యాదు చేశారని, గత ఏడాదితో పోలిస్తే 49 శాతం కాల్స్ పెరిగాయన్నారు.  తీవ్ర నేరాలకు సంబంధించి నిరుడితో పోల్చితే 23 శాతం క్రైమ్ రేట్ తగ్గిందన్నారు. 

శిక్షలు అమలు 

ఈ ఏడాది 55 కేసుల్లో 79 మంది నేరస్తులకు జైలు శిక్షలు పడ్డాయని, వీరిలో  ఆరుగురు నేరస్తులకు జీవితఖైదీ, బాలలపై లైంగిక నేరాలకు పాల్పడ్డ ముగ్గురికి 20 ఏళ్ల జైలు శిక్ష పడ్డట్లు తెలిపారు.  వివిధ కేసుల్లో 12 మందికి 10 ఏళ్లకు పైబడి, 15 మందికి 5 ఏళ్లకు పైబడి జైలు శిక్షలు పడ్డాయన్నారు.  770   సైబర్ క్రైమ్ పిర్యాదుల్లో సైబర్ మోసగాళ్లు రూ. 4.7 కోట్లు దొంగలించగా రూ. 2.60 కోట్ల నగదు ఫ్రీజ్ చేశామన్నారు.  

గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 56 మందిపై 23 కేసులు నమోదు చేసి 605 కేజీల గంజాయి సీజ్ చేసి ఒకరిపై పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు.  అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 176 కేసులు నమోదు చేసి 214 వాహనాలు సీజ్ చేసి 226 మందిని అరెస్ట్ చేశామన్నారు. పీడీఎస్‌‌‌‌ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వారిలో 68 కేసులు నమోదు చేసి 1020 క్వింటాల బియ్యం సీజ్ చేసి 110 మందిని అరెస్ట్ చేశామన్నారు.