
- జిల్లా రెవెన్యూ అధికారి పద్మశ్రీ
ఖమ్మం, వెలుగు : కామన్ సర్వీస్ సెంటర్లతో ప్రజలకు ఎన్నో సేవలు అందుతాయని జిల్లా రెవెన్యూ అధికారి ఏ. పద్మశ్రీ తెలిపారు. గురువారం కలెక్టరేట్ లో నిర్వహించిన కామన్ సర్వీస్ సెంటర్ వర్క్ షాప్ ను ఆమె ప్రారంభించి మాట్లాడారు. అభివృద్ధిని గ్రామ స్థాయికి తీసుకుని వెళ్లేందుకు, గ్రామాలలో డిజిటల్ సేవలు మెరుగుపరచడానికి, ఆర్థిక ప్రగతి ఈ గవర్నెన్స్ అందించేందుకు కామన్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలోని 10 జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద ఈ కార్యక్రమం అమలు చేస్తుండగా, అందులో ఖమ్మం జిల్లా కూడా ఎంపిక అయిందన్నారు. ఖమ్మంలోని 589 గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే 434 కామన్ సర్వీస్ సెంటర్ లు ఏర్పాటు చేసి డిజిటల్ సేవలు అందిస్తున్నామని చెప్పారు.
మిగతా 155 గ్రామాల్లో సైతం ఇందిరా మహిళా శక్తి కింద మహిళా సంఘాలతో కామన్ సర్వీస్ సెంటర్ ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేశామని, 68 మంది స్వశక్తి మహిళా సంఘాలను గుర్తించామని, మిగిలిన సెంటర్లకు ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు.
డీఆర్డీవో సన్యాసయ్య మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించిందని తెలిపారు. మహిళా శక్తి కింద స్త్రీ టీ బ్రాండ్ ఏర్పాటు చేసి విజయం సాధించామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో దీక్షా రైనా, ఎస్బీఐ ఆర్ఎం లింగస్వామి, ఎల్డీఎం శ్రీనివాస రెడ్డి, అదనపు డీఆర్డీవో నూరొద్దీన్, సీఎస్సీ రాష్ట్ర హెడ్ కె. సునీల్ రెడ్డి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సుహాసిని తదితరులు పాల్గొన్నారు.