16 మందికి జీవిత ఖైదు

  • గౌరు అశోక్​రెడ్డి హత్య కేసులో జిల్లా కోర్టు తీర్పు
  • 2012లో వరంగల్​ జిల్లాలో సంచలనం సృష్టించిన హత్య

హన్మకొండ అర్బన్, వెలుగు:  వరంగల్​అర్బన్​జిల్లా హసన్​పర్తి మండలం నాగారానికి చెందిన బీజేపీ నేత గౌరు అశోక్​రెడ్డి హత్య కేసులో 16 మందికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ  జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి తిరుమలాదేవి తీర్పు చెప్పారు. 2012 నాటి ఈ కేసులో వాద ప్రతివాదనలు పూర్తి అయిన తర్వాత సోమవారం ఐపీసీ 148, 302, 120(బీ), 149, 341 సెక్షన్ల ప్రకారం జడ్జి తీర్పు ప్రకటించారు.

ప్రాణం తీసిన ‘బొడ్రాయి’ గొడవ

గౌరు అశోక్​ రెడ్డి దారుణ హత్యకు బొడ్రాయి ప్రతిష్ఠాపన విషయంలో జరిగిన గొడవ కారణమైంది. నాగారంలో 2011 డిసెంబర్‌‌లో బొడ్రాయి ప్రతిష్ఠాపన సమయంలో అశోక్​రెడ్డికి, అదే గ్రామానికి చెందిన గౌరు యాదగిరి రెడ్డి, పోరెడ్డి సమ్మిరెడ్డి, బొద్దుకూరి సమ్మయ్య, దామెర యాదగిరి, బండారి సాంబయ్యతో చందాల వసూళ్ల విషయంలో గొడవ జరిగింది. దీంతో వీరంతా అశోక్​రెడ్డిపై కోపం పెంచుకున్నారు. ఆ తర్వాత హన్మకొండలో ఉండే అశోక్​రెడ్డి 2012 మార్చి 3న గ్రామంలో జరిగిన కనుకుంట్ల గణేష్​ పెండ్లికి వచ్చాడు. పెండ్లి ఊరేగింపులో బండారి రాజుతో గొడవ జరిగింది. దీంతో అశోక్​రెడ్డిపై కోపగించుకున్న రాజు గౌరు యాదగిరి రెడ్డి, ఇతరులతో కలిసి హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. మరునాడు హన్మకొండకు బయలుదేరిన అశోక్​రెడ్డిని దారిలో మొక్కజొన్న చేను వద్ద ఆపారు. అశోక్​రెడ్డి భార్య మమత, 9 ఏండ్ల కొడుకు,5 ఏండ్ల కూతురి ముందే అతడిని కర్రలు, బ్యాట్లు, ఇనుపకడ్డీలతో తీవ్రంగా కొట్టి పారిపోయారు. అశోక్​రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. కాగా, దోషులను వరంగల్ సెంట్రల్​జైలుకు తరలించారు. తీర్పు వెలువడగానే దోషుల కుటుంబ సభ్యులు కోర్టు హాల్ వద్దే విలపించారు. కోర్టు తీర్పు నేపథ్యంలో నాగారంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

శిక్ష పడింది వీరికే..

కొండెపాక భిక్షపతి అలియాస్​రఘు, బండారి రాజు, గౌరు భగవాన్​రెడ్డి, సిలువేరు అశోక్, బండారి గణేష్​, కుక్కుముడి జయరాజ్, దామెర రాజ్​కుమార్, మెరుగు రాజు, రావుల కర్ణాకర్, దున్నపోతుల శ్రీకాంత్, గుంటి రాజేంద్ర ప్రసాద్, గౌరు యాదగిరి రెడ్డి, పోరెడ్డి సమ్మిరెడ్డి, బొడ్డుకూరి సమ్మయ్య, దామెర యాదగిరి, బండారి సాంబయ్య. వీరిలో  కొండెపాక భిక్షపతి నాగారం  సర్పంచ్​ కాగా, గౌరు యాదగిరి రెడ్డి, గౌరు భగవాన్​రెడ్డి తండ్రీ కొడుకులు.