
కాగజ్ నగర్, వెలుగు: విద్యార్థి దశలో కచ్చితమైన ప్రణాళికతో చదివితే ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ సురేశ్ కుమార్ అన్నారు. మంగళవారం సిర్పూర్ టి మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో పోలీసులు మీకోసంలో భాగంగా పదో తరగతి స్టూడెంట్స్‌కు ఎగ్జామ్ ప్యాడ్స్, ఇతర సామగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కృషి, తపన, పట్టుదల, సమయపాలన విజయానికి ముఖ్య సూత్రాలన్నారు.
మారుమూల గ్రామంలో పుట్టిన తాను కనీసం బస్ సౌకర్యం లేని ఊరి నుంచి మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లి చదివి ఐపీఎస్‌గా ఎదిగానని చెప్పారు. లక్ష్యం సాధించడానికి ఒత్తిడిని అధిగమించి ముందుకు వెళ్లాలని సూచించారు. అనంతరం 750 మంది విద్యార్థులకు పరీక్షల మెటీరియల్ అందించారు. కాగజ్‌నగర్ డీఎస్పీ కరుణాకర్, కౌటాల సీఐ సాదిక్ పాషా, ఎస్ఐ దీకొండ రమేశ్, ప్రిన్సిపాల్ బాలరాజు, సంగీత పాల్గొన్నారు.