భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం టౌన్, వెలుగు : ఆఫీసర్ల సమన్వయంతో పని చేయాలని, అప్పుడే లక్ష్యాలను సాధించగలుగుతామని జిల్లా ప్రత్యేక అధికారి గౌతమ్ అన్నారు. కొత్తగూడెం పట్టణం, చుంచుపల్లి మండలంలో కలెక్టర్ జితేశ్ వి పాటిల్‌తో కలిసి ఆయన గురువారం పర్యటించారు. స్వచ్ఛదనం–పచ్చదనం ప్రోగ్రాం పనులను పర్యవేక్షించారు. పట్టణంలోని యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించి తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. రుద్రంపూర్ గ్రామ పంచాయతీలోని హైస్కూల్లో ఏర్పాటు చేసిన మెడిసినల్ ప్లాంటేషన్‌ను పరిశీలించారు.
స్టూడెంట్స్‌కు నోట్ బుక్స్ పంపిణీ చేశారు. మొక్కలు నాటారు. అనంతరం పలు శాఖల అధికారులతో నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం–పచ్చదనం ప్రోగ్రాంను జిల్లా వ్యాప్తంగా సక్సెస్ చేయాలన్నారు. ఈ ప్రోగ్రాంలో డీఆర్డీవో విద్యాచందన, డీపీవో చంద్రమౌళి, జడ్పీ సీఈవో కె. చంద్రశేఖర్, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ శేషాంజన్ స్వామి, చుంచుపల్లి ఎంపీడీవో అశోక్ కుమార్ పాల్గొన్నారు.
ఖమ్మంలో...
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గురువారం స్వచ్ఛదనం– పచ్చదనం ప్రోగ్రామ్ నిర్వహించారు. కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, మేయర్ నీరజ, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సుంకర రాజేశ్వరరావుతో కలిసి ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ నుంచి స్వచ్ఛదనం– పచ్చదనం ర్యాలీని గౌతమ్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వరకు కొనసాగింది. కాలేజ్ ఆవరణ లో గౌతమ్ మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పిల్లలందరూ పచ్చదనం,పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండాలన్నారు.
మెప్మా సిబ్బందితో మాట్లాడుతూ ప్రతివారం డ్రైడే, ఫ్రైడే కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. డంపింగ్ యార్డ్ ను సందర్శించిన ఆయన అక్కడ జరుగుతున్న బయో మైనింగ్ ను పరిశీలించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని సూచించారు. అనంతరం సీడీఎమ్ఏ, కేఎంసీ ఆఫీస్ స్టాఫ్ తో మీటింగ్ నిర్వహించారు. అన్ని సెక్షన్లలో జరిగే పనులను పర్యవేక్షించారు. రెవెన్యూ కలెక్షన్, టౌన్ ప్లానింగ్ కు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేఎంసీ అసిస్టెంట్ కమిషనర్ సంపత్ కుమార్, మున్సిపల్ సిబ్బంది మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.