ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు ఉండొద్దు : సురేంద్రమోహన్​

ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు ఉండొద్దు : సురేంద్రమోహన్​
  • పలు పనులపై కలెక్టర్లతో రివ్యూ మీటింగ్​
  • ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా స్పెషల్​ ఆఫీసర్​ సురేంద్ర మోహన్​ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్​లో మంగళవారం కలెక్టర్​ ప్రియాంక అలతో కలిసి ఆయన పలు శాఖల అధికారులతో నిర్వహించిన రివ్యూ మీటింగ్​లో మాట్లాడారు. జిల్లాలో 136 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు 2,081 మంది రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం తడవకుండా టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని మార్కెటింగ్​ అధికారులను ఆదేశించారు. 

నెలాఖరులోపు ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసేలా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలన్నారు. తేమ పేరుతో రైతులను ఇబ్బందులు పెట్టొదని చెప్పారు. ఈ ప్రోగ్రాంలో అడిషనల్​ కలెక్టర్​ వేణుగోపాల్, డీఆర్డీవో విద్యాచందన, జిల్లా సివిల్​ సప్లై ఆఫీసర్​ రుక్మిణి, డీఏవో బాబూరావు, ఆర్డీవో కిషన్​రావు, తూనికలు కొలతల శాఖాధికారి మనోహర్, జిల్లా మార్కెటింగ్​అధికారి అలీం, సివిల్​ సప్లై డీఎం త్రినాథ్​, జిల్లా సహకార శాఖాధికారి ఖుర్షీద్, జీసీసీ డివిజనల్​మేనేజర్​ విజయ్​ కుమార్​పాల్గొన్నారు. 

ఆకస్మిక తనిఖీ..

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని సుజాతనగర్​లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సురేంద్రమోహన్​ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తేమ శాతం 20 ఉన్నట్టుగా గుర్తించారు. 17శాతం తేమ వచ్చే వరకు రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలని సూచించారు. అనంతరం సమీపంలోని పారాబాయిల్డ్​ రైస్​ మిల్లును సందర్శించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని, సకాలంలో సీఎంఆర్​ సరఫరా చేయాలని ఆదేశించారు. 

ఖమ్మం జిల్లాలో పలు పనులపై సమీక్ష 

ఖమ్మం టౌన్ :  ఖమ్మంలో న్యూ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్​లో కలెక్టర్ వీపీ గౌతమ్ తో కలిసి అధికారులతో ధాన్యం కొనుగోలు, తాగునీటి సరఫరా, అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల పురోగతి, గనులు, భూగర్భ శాఖల లక్ష్యాలపై సురేంద్ర మోహన్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో యాసంగి ధాన్యం దిగుబడి అంచనా, కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరణ, ఇంకా రావాల్సిన ధాన్యం అంచనాలపై, ధాన్య కొనుగోలు కేంద్రాల వద్ద సదుపాయాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

 వేసవిలో జిల్లాలో తాగునీటి సరఫరాలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టిన కలెక్టర్, అడిషనల్​ కలెక్టర్, అధికారులను ఆయన అభినందించారు. పాలేరు, వైరా రిజర్వాయర్లలో జులై నాటికి తాగునీటి సరఫరాకు కావాల్సిన నీరు అందుబాటులో ఉన్నట్లు, తాగునీటి సరఫరాకు ఎలాంటి సమస్యలు లేవని అధికారులు ప్రత్యేక అధికారికి వివరించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల పురోగతిపై స్పెషల్​ ఆఫీసర్​ సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో గనులు, భూగర్భ శాఖ కార్యకలాపాలు, ఖనిజ వనరుల లభ్యత, రెవెన్యూ లక్ష్యం, వసూళ్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇసుక అక్రమ రవాణాను నియంత్రించాలని సూచించారు. 

20వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నాం.. 

ఖమ్మం జిల్లాలో  1.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యంను కొనుగోలు చేసినట్లు కలెక్టర్ గౌతమ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 157 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని,90 కేంద్రాల్లో మాత్రమే ధాన్యం కొనుగోళ్లు జరిగినట్లు తెలిపారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో తూకం, తేమ పరీక్ష యంత్రాలు, టార్ఫాలిన్, రైతులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కింద జిల్లాలో 753 స్కూళ్లలో  అభివృద్ధి పనులు మంజూరు చేశామన్నారు.

 651 పాఠశాలల్లో పనులు ప్రారంభించగా, 102 పాఠశాలల్లో పనులు ప్రారంభించాల్సి ఉందని తెలిపారు. 226 పాఠశాలల్లో పనులు పూర్తి కాగా, 425 పాఠశాలల్లో పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు.  పర్యటనలో ప్రత్యేక అధికారి కొనిజర్ల మండల కేంద్రంలోని విజయలక్ష్మి పారా బాయిల్డ్ రైస్ మిల్ తనిఖీ చేశారు. ఒప్పందం మేరకు సీఎంఆర్ రైస్ అందించాలన్నారు. ఖరీఫ్, రబీ సీఎంఆర్ రైస్ అందజేతపై వివరాలు అడిగారు. 

ఖరీఫ్ బకాయి సీఎంఆర్ రైస్ వెంటనే అందించి, రబీ సీఎంఆర్ రైస్ అందజేతపై చర్యలు తీసుకోవాలని ప్రత్యేక అధికారి ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్​ కలెక్టర్లు బి. సత్యప్రసాద్, డి. మధుసూదన్ నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల, జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్, జిల్లా సహకార అధికారి సయ్యద్ ఖుర్షీద్, జిల్లా రవాణా అధికారి ఆఫ్రీన్ సిద్దిఖీ, జిల్లా మార్కెటింగ్ అధికారి అలీమ్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ శ్రీలత, మిషన్ భగీరథ ఎస్ఈ సదాశివ కుమార్, ఈఈలు పుష్పలత, వాణిశ్రీ, వ్యవసాయ సహాయ సంచాలకులు సరిత, ఏపీడీ నూరొద్దీన్, ఎఫ్​సీఐ డివిజనల్ మేనేజర్ రంగ ప్రసాద్ నాయక్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రం పరిశీలన

వైరా : వైరా వ్యవసాయ మార్కెట్​ లో  డీసీఎంఎస్  ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అడిషనల్​ కలెక్టర్​ మధుసూదన్ నాయక్​, సివిల్ సప్లై డీఎం  శ్రీలతతో కలిసి సురేంద్రమోహన్​ పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యాన్ని మిల్లర్లు కొర్రీలు పెట్టకుండా దిగుమతి చేసుకోవాలని సూచించారు. వారి వెంట డీఎస్​వో చందన్ కుమార్, సెక్రటరీ ఉన్నారు.