- ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి సురేంద్ర మోహన్
భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం టౌన్, వెలుగు : ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని రాష్ట్ర గనుల శాఖ కార్యదర్శి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేక అధికారి కే.సురేంద్ర మోహన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం కలెక్టరేట్లలో వేర్వేరుగా ఆయన అధికారులతో రివ్వూ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు చేసిన 48 గంటల్లో డబ్బులు చెల్లించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తుందని చెప్పారు. తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ మాట్లాడుతూ జిల్లాలో రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం 323 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
జిల్లా సరిహద్దు లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నందున 14 చెక్ పోస్ట్ లను అప్రమత్తం చేశామని, వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ అధికారులు 24 గంటలపాటు షిఫ్టులలో చెక్ పోస్ట్ వద్ద ఉండేలా చర్యలుతీసుకున్నామని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో 2,95,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తోందని అంచనా వేశామన్నారు. 165 కొనుగోలు కేంద్రాలు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్, తేమ యంత్రాలు, వెయింగ్ మిషన్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. గన్నీ సంచులకు ట్యాగ్ చేయాలన్నారు.
అనంతరం చుంచుపల్లి మండలంలో, కల్లూరు పరిధిలోని గోపాలదేవబోయినపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. కొత్తగూడెంలో డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, అడిషనల్ కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, డీఏవో బాబురావు, సీవిల్ సప్లై ఆఫీసర్ రుక్మిణి, డీఎస్వో త్రినాధ్ బాబు, ఖమ్మంలోఅడిషనల్ కలెక్టర్లు డాక్టర్ పీ. శ్రీజ, పీ. శ్రీనివాస్ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ మృణాళ్ శ్రేష్ఠ, డీఆర్డీవో సన్యాసయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఎంఏ అలీమ్, జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్, జిల్లా సహకార అధికారి జీ. గంగాధర్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ జీ. శ్రీలత, అదనపు డీఆర్డీవో నూరొద్దీన్, తదితరులు పాల్గొన్నారు.