ఇల్లెందు మున్సిపాలిటీలో ..మళ్లీ అవిశ్వాసం లొల్లి

  • మున్సిపల్​ చైర్మన్​ వెంకటేశ్వరరావును టార్గెట్​చేసిన బీఆర్ఎస్ లీడర్లు
  • ఒక్కో కౌన్సిలర్​కు రూ. 25లక్షల వరకు ఆఫర్?

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఇల్లెందు మున్సిపాలిటీలో అవిశ్వాసం లొల్లి మళ్లీ మొదలైంది. మున్సిపల్​ చైర్మన్​ డి. వెంకటేశ్వరరావును పదవి నుంచి దిపేందుకు బీఆర్​ఎస్​ లీడర్లు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మున్సిపాలిటీలో 24 మంది కౌన్సిలర్లు ఉండగా దాదాపు 15 నుంచి 18 మంది కౌన్సిలర్ల సంతకాలు చేసి కలెక్టర్​కు  నోటీసు ఇవ్వడంతో చర్చనీయాంశమైంది. 

తెరవెనుక లీడర్లు.. 

మాజీ ఎమ్మెల్యేతో పాటు ఓ బీఆర్ఎస్​ లీడర్​ తెరవెనుక నుంచి ఈ రాజకీయం నడిపిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. మున్సిపాలిటీ చైర్మన్​గా ఉన్న డి. వెంకటేశ్వరరావుపై అవిశ్వాసం పెట్టాలంటూ బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు గతేడాది అప్పటి కలెక్టర్​అనుదీప్​కు అవిశ్వాసం లేఖను ఇచ్చారు. ఆ టైంలో మున్సిపల్​ చైర్మన్​  బీఆర్ఎస్​లో ఉండడంతో లేఖను ఎమ్మెల్సీ తాతా మధుసూదన్​ సూచనలతో  కలెక్టర్​ తొక్కి పట్టారనే ప్రచారం నడచింది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రావడంతో అవిశ్వాసం గొడవ సద్దుమణిగింది. 

మద్దతిస్తే భారీ ఆఫర్..

ప్రస్తుతం అవిశ్వాసానికి మద్దతిచ్చే ఒక్కో కౌన్సిలర్​కు రూ. 20 లక్షల నుంచి రూ. 25లక్షల వరకు ఓ బీఆర్​ఎస్​ లీడర్​ ఆఫర్​ ఇస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ ఏడాదిలో జరుగనున్న మున్సిపల్​ ఎన్నికల్లో గెలిచేందుకు డబ్బులు అవసరమవుతాయని అవిశ్వాసానికి మద్దతు ఇస్తున్నామని పలువురు కౌన్సిలర్లు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.  ఈ విషయంపై మున్సిపల్​ చైర్మన్​ డి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తాను పట్టణాభివృద్ధికి ఎంతో కృషి చేశానన్నారు. కొందరు కౌన్సిలర్ల అక్రమాలను తాను అడ్డుకున్నందుకే తనపై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్​ఎస్​ లీడర్లు కుట్ర పన్నుతున్నారని తెలిపారు. తాను అవినీతికి పాల్పడలేదని, అవిశ్వాసాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. 

చైర్మన్​ కాంగ్రెస్​లో చేరిక.. మళ్లీ  తెరపైకి.. 

అప్పటి ఎమ్మెల్యే భానోత్​ హరిప్రియ, ఆమె భర్త హరిసింగ్​ తెరవెనుక చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు, తనపై వ్యతిరేకంగా అవిశ్వాసాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ మున్సిపల్​ చైర్మన్​ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు బీఆర్​ఎస్​కు రాజీనామా చేసి కాంగ్రెస్​ పార్టీలో  చేరారు. ఎమ్మెల్యేగా కోరం కనకయ్య గెలుపు కోసం కృషి చేశారు. మున్సిపల్​ చైర్మన్​ కాంగ్రెస్​లో చేరడంతో బీఆర్​ఎస్​కు చెందిన కొందరు లీడర్లు, కౌన్సిలర్లతో కలిసి అవిశ్వాసానికి మళ్లీ సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే పలువురు కౌన్సిలర్లతో సంతకాలు చేయించిన లేఖను ఉన్నతాధికారులకు ఇటీవల పంపినట్టుగా కౌన్సిలర్లు చెబుతున్నారు.