- ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డితో విభేదించే లీడర్లను పక్కన పెడుతున్న మాజీ ఎమ్మెల్యేలు
- పార్లమెంట్‌స్థాయి సమావేశాల్లో లీడర్లకు అవమానం
- ఇప్పటికే పార్టీకి దూరమైన మండలి చైర్మన్‌గుత్తా సుఖేందర్‌రెడ్డి, అమిత్
- హైకమాండ్‌ను మిస్‌గైడ్ చేస్తున్నారనే ఆరోపణలు
నల్గొండ, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కల్లోలం నెలకొంది. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ నాయకత్వం సమష్టిగా పనిచేయాలని కేటీఆర్, హరీశ్‌రావు చెప్పినా జిల్లా నేతల మధ్య సఖ్యత లేకపోవడం గందరగోళానికి దారితీస్తోంది. ఎంపీ టికెట్ఆశించిన వారిని నల్గొండ, భువనగిరి పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశాలకు పిలవకుండా దూరం పెట్టారని మండిపడుతున్నారు. మీటింగ్‌లకు చెప్పలేదన్న బాధ కంటే, వచ్చిన ముఖ్యమైన లీడర్లను కనీసం వేదికపైకి పిలవకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
రెండు ఎంపీ సెగ్మెంట్లకు జిల్లా మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఎంపీ అభ్యర్థులను డిసైడ్చేయడంలో కూడా జగదీశ్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు. దీంతో ఆయనతో విభేదించే లీడర్లను పార్టీ కార్యక్రమాలకు పిలవట్లేదు. ఇప్పటికే మండలి చైర్మన్‌గుత్తా సుఖేందర్‌రెడ్డి కొడుకు అమిత్‌కు ఎంపీ టికెట్ఇవ్వకుండా అవమానించారు. దీంతో ఆయన కాంగ్రెస్ లీడర్లతో టచ్ లో ఉన్నాడనే కారణంతో పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టారు. నల్గొండ, భువనగిరి ఎంపీ టికెట్ఆశించిన అమిత్.. రెండుచోట్ల జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశాలకు వెళ్లలేదు.
సుఖేందర్‌రెడ్డి సైతం అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి సైలెంటయ్యారు. నల్గొండ ఎంపీ క్యాండేట్ కంచర్ల కృష్ణారెడ్డి గుత్తాను మర్యాదపూర్వకంగా కలవడం మినహా... ముఖ్యమైన లీడర్లు ఎవరూ ఆయనతో టచ్‌లో ఉండడం లేదని తెలిసింది. తాజాగా భువనగిరిలో మీటింగ్ లో పలువురు ముఖ్యమైన లీడర్లకు జరిగిన అవమానం గురించి పార్టీలో చర్చ జరుగుతోంది.
మండిపడుతున్న బీసీ లీడర్లు...
భువనగిరి టికెట్బీసీ సామాజిక వర్గానికి ఇచ్చిన పార్టీ.. అదే వర్గానికి చెందిన లీడర్లను మాత్రం మీటింగ్‌లకు పిలవడం లేదు. గొర్రెల కార్పొరేషన్మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్ తోపాటు మేడే రాజీవ్‌సాగర్, సోమా భరత్కుమార్పార్టీ నేతల వైఖరిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్మాజీ చైర్మన్లుగా పనిచేసిన తాము కేసీఆర్సైనికులుగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించామని, తమ పదవులు పోవడంతో పార్టీలో గౌరవం తగ్గిపోయిందని విచారం వ్యక్తం చేస్తున్నారు. మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్నియోజకవర్గాలకు చెందిన
ఈ మాజీ చైర్మన్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో హల్చల్చేశారు. కానీ, ఇప్పుడు పదవులు కోల్పోవడంతో జిల్లా నేతలు వాళ్లను పట్టించుకోవడం లేదు. మునుగోడు నుంచి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేసిన మాజీ ఎమ్మె ల్సీ కర్నె ప్రభాకర్ కు సైతం మీటింగ్‌లో మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. మునుగో డు ఉపఎన్నికలప్పటి నుంచే ప్రభాకర్‌ను పార్టీకి దూరంగా ఉంచారు. తాజాగా ఆ పరిస్థితి తమకు ఎదురైందని, ఫ్లెక్సీలో తమ ఫొటోలు కూడా ముద్రించలేదని ఆవేదన చెందుతున్నారు. ఎంపీ టికెట్రేసులో ఉన్న ముఖ్యమైన వాళ్లలో జిట్టా బాలకృష్ణారెడ్డి కూడా ఒకరు. ఆయన కూడా భువనగిరి మీటింగ్‌కు రాపోవడం అనుమానాలకు తావిస్తోంది.
హైకమాండ్‌కు తప్పుడు రిపోర్ట్...
మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి తో విభేదించే లీడర్ల గురించి హైకమాండ్‌కు తప్పుడు రిపోర్ట్అందిస్తున్నారని, తమ రాజకీయ భవిష్యత్‌ను దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్నారని అంటున్నారు. ఇటీవల నల్గొండలో జరిగిన విస్తృత స్థాయి మీటింగ్‌కూడా అన్ని నియోజకవర్గాల నుంచి ముఖ్యమైన నేతలు రాలేదు. తమ అనుచరులుగా చలామణి అయ్యే వారిని మాత్రమే మీటింగ్‌కు పిలిచారు. అసలుకే కొత్త అభ్యర్థులతో ప్రజల్లోకి ఎలా వెళ్లాలని పార్టీ కేడర్ సందేహిస్తోంది.
గుత్తా అమిత్ విషయంలో తెరవెనక రాజకీయం..
అమిత్‌కు నల్గొండ టికెట్ఇవ్వాలని పార్టీ హైకమాండ్ భావించింది. అయితే, పలువురు మాజీ ఎమ్మెల్యేలు అమిత్‌పై అధిష్టానికి ఫిర్యాదు చేయడంతో అతడు వెనక్కితగ్గారని తెలిసింది. గుత్తా ఫ్యామిలీని రాజకీయం గా దెబ్బతీసేందుకు జగదీశ్ రెడ్డి వర్గం గట్టిగానే ప్రయత్నించిందని, దాంతోనే అమిత్పోటీ చేయనని చెప్పారని ప్రచారం జరిగింది. కానీ, జగదీశ్ రెడ్డి వర్గం మాత్రం అమిత్తనకు తానే పోటీ నుంచి తప్పుకున్నాడని, ఎంపీగా పోటీ చేయనని చెబితేనే కృష్ణారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించాల్సి వచ్చిందని చెబుతోంది.
ఎన్ని కల్లో గుత్తావర్గం సపోర్ట్ పొందేందుకే ఈ తరహా ప్రచారం మొదలు పెట్టారని ఆయన వర్గీయులు అంటున్నారు. ఇదిలావుంటే జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి అనారోగ్యం కారణాలతో ఇంటికే పరిమితమయ్యారని చెపుతున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ ఇన్చార్జిగా ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆయన కేటీఆర్మీటింగ్రాలేదని తెలిసింది. దీంతో కేటీఆర్ స్వయంగా నరేందర్‌రెడ్డి ఇంటికి వెళ్లి రావడం మరింత చర్చకు దారితీసింది.