టికెట్ ఇవ్వకుంటే తిరగబడుడే.. అధిష్టానాలపై ఘాటు విమర్శలు

  • నిన్నటిదాకా ముద్దు.. ఇప్పుడేమో చేదు
  • ప్రత్యర్థి పార్టీల్లోకి చేరికలు
  • మూడు పార్టీల నేతలదీ అదే తీరు

నిర్మల్, వెలుగు: టికెట్​ఆశించి భంగపడ్డ నేతలు పార్టీ హైకమాండ్లపై తిరగబడుతున్నారు. నిన్నటి వరకు భుజాలపై ఎత్తుకొని మోసిన పార్టీలనే ఓడిస్తామంటూ సవాల్ విసురుతున్నారు. డబ్బులకు టికెట్లు అమ్ముకున్నారంటూ ఘాటు విమర్శలు చేస్తూ.. పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఏదో పార్టీ నుంచి రెబెల్​గా పోటీచేస్తామని ప్రకటిస్తున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్, పెంబి జడ్పీటీసీ జానుభాయి, ముథోల్ మాజీ జడ్పీటీసీ విజయ్ కుమార్ రెడ్డితో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు నేతల తీరు చర్చనీయాంశమవుతోంది. 

తనను అణచివేశారంటూ రేఖా నాయక్​ ధ్వజం

ప్రధాన పార్టీల తరఫున ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురు, నలుగురు నేతలు అసెంబ్లీ టికెట్ ఆశించారు. ఈ మేరకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. దీంతో హైకమాండ్లు టికెట్ విషయంలో ఆచితూచి వ్యవహరించి సర్వేలు, ఇతర విషయాల ఆధారంగా టికెట్లు ఇచ్చింది. బీఆర్ఎస్​అన్ని నియోజకవర్గాల టికెట్లను ఒకేసారి కేటాయించగా.. టికెట్​దక్కని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు మొదలుపెట్టారు.

మహిళా నేతనైన తనను అధిష్టానం ఉద్దేశపూర్వకంగా అణిచివేసిందని కంటతడి పెట్టారు.  కేటీఆర్​కు సన్నిహితుడు, స్థానికేతరుడైనప్పటికీ జాన్సన్​జాయక్​కు టికెట్​ఇచ్చారని, ఖానాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్​ను ఓడించడమే తన ధ్యేయమని ప్రతిజ్ఞ చేశారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ ను విమర్శిస్తూ పల్లెల్లో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ టికెట్ కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఆమె భర్త శ్యామ్ నాయక్​కు ఆసిఫాబాద్ టికెట్ ఇచ్చిన అధిష్టానం ఆమెకు అవకాశం ఇవ్వలేదు. అయినప్పటికీ జాన్సన్ నాయక్ ఓటమి కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేయనున్నట్లు ఆమె సన్నిహితుల వర్గాలు చెప్తున్నాయి.

డబ్బులున్న వ్యక్తికి ఇచ్చారని రమాదేవి ఆరోపణ

బీజేపీ నిర్మల్​ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి ఈసారి కూడా ముథోల్ సెగ్మెంట్ అసెంబ్లీ టికెట్ ఆశించారు. 2018 ఎన్నికల్లో కూడా ఆమె బీజేపీ తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈసారి కూడా టికెట్ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. అయితే హైమకాండ్​ఆమెకు కాకుండా కొద్ది రోజుల క్రితం పార్టీలో చేరిన రామారావు పటేల్​కు టికెట్ కేటాయించింది. దీంతో పార్టీ తనకు అన్యాయం చేసిందని కంటతడి పెట్టుకొని తాను సీనియర్ నేతనైనప్పటికీ డబ్బులున్న వ్యక్తికి టికెట్ ఇచ్చారంటూ ఆరోపించారు.

దీంతోపాటు పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతివ్వనున్నట్లు ప్రకటించారు. వారం రోజుల కింద వరకు బీజేపీ తరఫున ఊరూరా తిరిగి అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై దుమ్మెత్తిపోసిన రమాదేవి.. టికెట్ రాకపోవడంతో తన వైఖరిని మార్చుకొని నిన్నటి వరకు ప్రశంసించిన పార్టీపైనే ఆరోపణలు చేస్తున్నారు. ముథోల్​లో బీజేపీ అభ్యర్థిని ఓడించడమే తన ధ్యేయమంటూ ఆమె చేసిన ప్రకటన సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. 

జానుభాయి, విజయ్​కుమార్​ రెడ్డిది అదే దారి

ఖానాపూర్ నియోజకవర్గంలోని పెంబి మండల జడ్పీటీసీ జానుభాయి సైతం బీజేపీ టికెట్ ను ఆశించారు. అయితే టికెట్​ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ కు కేటాయించడంతో ఆమె కూడా తనకు పార్టీ అన్యాయం చేసిందని ఆరోపించి అధిష్టానంపై తిరుగుబాటు ప్రకటించారు. అనుచరులతో చర్చించిన భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తానంటూ వెల్లడించడం పట్ల ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ మొదలైంది.

కాంగ్రెస్​నుంచి ముథోల్ టికెట్​ఆశించిన మాజీ జడ్పీటీసీ విజయ్ కుమార్ రెడ్డి సైతం రెబల్​గా మారారు. అమెరికాలో ఉన్న తనకు టికెట్​ఆశ చూపి రేవంత్​రెడ్డి అక్కడి నుంచి రప్పించారని, తీరా చివర్లో టికెట్​ నిరాకరించారని మండిపడ్డారు. పార్టీ మారుతానని వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలోని మరో మూడు, నాలుగు నియోజకవర్గాల్లోనూ ఇదే తరహా వ్యవహారం కొనసాగుతోంది. పార్టీ పదవులు, అధికార పదవులు పొందినప్పటికీ టిక్కెట్ రాకపోవడంతోనే సొంత పార్టీపైనే తిరుగుబాటు ప్రకటిస్తుండడంతో జనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.