జ్యూస్, కూల్ డ్రింక్స్ ఇలా ఏవి తాగాలన్నా గతంలో ఎక్కువగా ప్లాస్టిక్ గ్లాసులు వాడేవాళ్లు. ఇప్పుడు వాటిని పేపర్ గ్లాస్లు వచ్చి రీప్లేస్ చేశాయి. ఇవైతే పర్యావరణానికి ఇబ్బంది ఉండదు. పైగా ఖర్చు తక్కువ. ఈ ఉద్దేశంతో టీ, కాఫీలకు కూడా వాటినే విరివిగా వాడేస్తున్నారు. అయితే, పేపర్ కప్‌లో కూడా ప్లాస్టిక్ ఉంటుంది.
సన్నని ప్లాస్టిక్ కవర్ని కప్ లోపల లేయర్‌లా వేస్తారు. తద్వారా వేడి వేడి కాఫీ లేదా టీ పోస్తే అందులోని ప్లాస్టిక్ కరిగి మన నోటి ద్వారా కడుపులోకి చేరుతుంది. ఈ విషయం చాలామందికి తెలియక పోవచ్చు. కానీ, తెలిసినా నిర్లక్ష్యం చేస్తే చివరకు మనకే ముప్పు. కాబట్టి ఈ సమస్యకు చెక్ పెట్టడానికే ఈ ఫోల్డబుల్ స్టీల్ గ్లాస్ తయారుచేశారు. ప్రస్తుతం నేచర్ లవర్స్ అంతా ఎకో ఫ్రెండ్లీ గ్లాస్ అంటూ ఈ ఫోల్డబుల్ స్టీల్ గ్లాస్‌ని ప్రమోట్ చేస్తున్నారు కూడా.
దీన్ని వాడడం వల్ల రోజుకి ఎన్నిసార్లు టీ, కాఫీలు తాగినా ప్లాస్టిక్ మన ఒంట్లోకి చేరదు. కూల్ డ్రింక్స్, జ్యూస్‌లు వంటి చల్లని పదార్థాలు కూడా ఈ గ్లాసులో తాగితే పేపర్ కప్‌ల వల్ల చెత్త పెరగకుండా ఉంటుంది. ఇంట్లో అయితే ఓకే, కానీ, బయటకి వెళ్లినప్పుడు ఎలా? పేపర్ కప్ తప్పదు కదా? అంటారా.. మరేం పర్లేదు. ఈ గ్లాస్ ఫోల్డబుల్. అంటే.. దీన్ని ఎంచక్కా మడతపెట్టేయొచ్చు. ఈ గ్లాసుకి కింద సాసర్లా బేస్ ఉంటుంది. పైన మూత కూడా ఉంటుంది. మూతకు కీ చెయిన్‌లా తగిలించుకునే లింక్ ఉంటుంది.
కాబట్టి ఈ గ్లాసుని వాడిన తర్వాత కడిగి మూతపెట్టి మడతపెట్టేసి బ్యాగ్‌కు తగిలించుకోవచ్చు. చిన్న పర్స్‌లో కూడా పెట్టుకోవచ్చు. కావాలంటే స్టైల్‌గా జేబుకి కూడా తగిలించుకోవచ్చు. అంతేకాదు.. ఈ గ్లాస్‌ని ఐదేండ్ల పాటు నిరభ్యంతరంగా వాడొచ్చు. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయంటే ధర ఎక్కువ అనుకుంటారేమో.. కానీ కాదు. దీని ధర రూ. 500 లోపే. మన హెల్త్‌తోపాటు పర్యావరణాన్ని కాపాడడానికి ఇది చాలా బెస్ట్ కదూ!