న్యూఢిల్లీ: ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఇండియా షూటర్ల గురి అదురుతోంది. యంగ్ షూటర్ దివ్యాన్షి రెండు గోల్డ్ మెడల్స్‌తో మెరిసింది. బుధవారం జరిగిన జూనియర్ విమెన్స్ 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో దివ్యాన్షి 35–33 తేడాతో క్రిస్టినా మగ్నాని (ఇటలీ)పై గెలిచి స్వర్ణాన్ని సాధించింది. హిలోసి ఫౌరీ (ఫ్రాన్స్) బ్రాంజ్ మెడల్‌ను దక్కించుకుంది. 25 మీటర్ల టీమ్ పిస్టల్‌లో దివ్యాన్షి– తేజస్విని– విభూతి భాటియాతో కూడిన ఇండియా త్రయం 1711 పాయింట్లతో టాప్ ప్లేస్‌తో బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది.
చెక్, జర్మనీ వరుసగా సిల్వర్, బ్రాంజ్‌ను గెలిచాయి. జూనియర్ మెన్స్ 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో ముకేశ్ నీలావలి 585 పాయింట్లతో స్వర్ణాన్ని గెలిచాడు. సూరజ్ శర్మకు సిల్వర్ లభించింది. టీమ్ విభాగంలో ముకేశ్–సూరజ్–ప్రద్యూమ్న్ సింగ్‌తో కూడిన ఇండియా బృందం 1726 పాయింట్లతో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. జూనియర్ మెన్స్ 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌లో శౌర్య సైనీ–వేదాంత్ నితిన్–పరీక్షిత్ సింగ్ బ్రార్ త్రయం 1753 పాయింట్లతో గోల్డ్ మెడల్ నెగ్గారు. ఈ క్రమంలో జూనియర్ వరల్డ్ రికార్డును సమం చేశారు. ఓవరాల్‌గా ఇండియా 14 (10 గోల్డ్, 1 సిల్వర్, 3 బ్రాంజ్) మెడల్స్‌తో టాప్ ప్లేస్‌లో ఉండగా, అమెరికా (10), ఇటలీ (8) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.