స్థానిక ఎన్నికల్లో నోటాపై భిన్నాభిప్రాయాలు

స్థానిక ఎన్నికల్లో నోటాపై భిన్నాభిప్రాయాలు
  • పార్టీల ఒపీనియన్స్​ తీసుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం
  • నోటాను అభ్యర్థిగా ప్రకటించాలన్న ప్రతిపాదనకు 
  • కాంగ్రెస్​ నో.. బీఆర్ఎస్​ ఓకే
  • సుప్రీంకోర్టులో ఉన్నందున ఒపీనియన్​ చెప్పలేమన్న బీజేపీ

హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏక్రగీవాలు కాకుండా..  ఒక్క అభ్యర్థి ఉన్నా ‘నోటా’తో ఎలక్షన్​ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. దీనిపై బుధవారం ఈసీ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే మళ్లీ ఎన్నిక నిర్వహించాలన్న ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. మళ్లీ ఎన్నికలు నిర్వహించడం చాలా ఖర్చుతో కూడిన వ్యవహారమని పేర్కొన్నది. ఒకే నామినేషన్ వచ్చిన చోట ఏకగ్రీవంగా ఎన్నిక ప్రకటించకుండా.. నోటాను అభ్యర్థిగా పేర్కొంటూ ఎన్నిక నిర్వహించాలన్న ప్రతిపాదనను బీఆర్ఎస్ సమర్థించింది. కాగా, ఈ అంశం సుప్రీంకోర్టులో ఉన్నందున దీనిపై ఇప్పుడు మాట్లాడలేమని బీజేపీ పేర్కొన్నది. ఈ సందర్భంగా మీడియాతో కాంగ్రెస్​పార్టీ నేత కమలాకర్​రావు మాట్లాడుతూ.. నోటాను అభ్యర్థిగా పరిగణించడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తున్నదని చెప్పారు. ఏకగ్రీవమైన చోట ఎన్నికలు నిర్వహించడం ఖర్చుతో కూడిన అంశం అని అభిప్రాయపడ్డారు.   ప్రస్తుతం ఇది అమలు చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.

బెదిరించే అవకాశం: బీఆర్ఎస్​నేత భరత్​

ఏకగ్రీవ ఎన్నిక కోసం బెదిరింపులు, బలప్రదర్శన చేసే అవకాశం ఉందని బీఆర్ఎస్​ నేత సోమ భరత్​కుమార్​అన్నారు. రాజకీయ పార్టీలకు కొత్త మండలాల వివరాలు ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. అనంతరం బీజేపీ నేత మల్లారెడ్డి మాట్లాడుతూ.. నోటాపై తమ అభిప్రాయం ఎన్నికల కమిషన్ కు వివరించామని, సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పడు తమ ఒపీనియన్​చెప్పలేమని పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ విషయంపై నిర్ణయం  తీసుకోలేదన్నారు.  పంచాయతీ ఎన్నికల నిర్ణయం ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పారు. నోటాతో ఎన్నిక ఉండాలని సుప్రీం కోర్టు ఇప్పటికే చెప్పిందని, అభ్యర్ధి కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే మళ్లీ ఎన్నికలు నిర్వహించడం సరికాదని  సీపీఎం నేత నర్సింహమూర్తి తెలిపారు. తమ పార్టీ అభిప్రాయం రెండు, మూడు రోజల్లో లిఖిత పూర్వకంగా తెలుపుతామని టీడీపీ నేత యాదగౌడ్​ చెప్పారు. నోటా అవసరం ఉందని, దీంతో పాలకపక్ష, ఇతర పార్టీ అభ్యర్థులను బెదిరింపులకు గురిచేయకుండా అవకాశం ఉండదని జనసేన పార్టీ నేత  నేమూరి శంకర్​గౌడ్ పేర్కొన్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్​తరుఫున రాజేశ్​​కుమార్, బీజేపీ నుంచి ఆంధోని రెడ్డి, ఆప్​నుంచి అబ్బాస్​హసన్, బీఆర్ఎస్​నుంచి పల్లె రవికుమార్​గౌడ్​, రాకేశ్​​కుమార్, అలిండియా ఫార్వర్డ్​బ్లాక్​నుంచి బండా సురేందర్, సీపీఐ నుంచి తక్కెళ్లపల్లి శ్రీనివాస్​రావు  పాల్గొన్నారు. 

నోటాతో రైట్​నాట్​టు ఓట్​ఎనీ వన్ హక్కు

నోటా ద్వారా ఓటర్లు రైట్​నాట్​టు ఓట్​ఎనీ వన్​  అనే హక్కును వినియోగించుకోలుగుతారని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొన్నది.  పోలింగ్​లో ఓటర్ల భాగస్వామ్యం పెరగడం, మంచి అభ్యర్థిని పోటీలో ఉంచే విధంగా రాజకీయ పార్టీలపై ఒత్తిడి చేసే అవకాశం ఉంటుందని తెలిపింది. 2016 ఫిబ్రవరిలో నిర్వహించిన ఖమ్మం మున్సిపల్ ​కార్పొరేషన్, అచ్చంపేట, సిద్దిపేట మున్సిపాలిటీల్లో జరిగిన ఎన్నికల్లో మొదటిసారి నోటాను అమలు చేసినట్టు చెప్పింది.  బరిలో ఒకే అభ్యర్థి ఉన్నప్పటికీ, బ్యాలెట్​లో నోటాను జత చేసి పోలింగ్​జరిపి, నోటాకు పోలైన ఓట్లను పరిగణనలోకి తీసుకోకుండా ఆ అభ్యర్థిని ఎన్నికైనట్లు ప్రకటించే విధంగా వ్యవస్థను మార్చుటకు తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా తెలిజేయాలని రాజకీయ పార్టీలను కోరింది.