- కలెక్టర్ల ఖాతాల్లో బదిలీ చేయాలని ఒత్తిళ్లు
వనపర్తి, వెలుగు: జిల్లా పరిషత్‌లకు పైసా ఇవ్వని రాష్ట్ర సర్కారు.. కేంద్రం ఇచ్చే 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులను కూడా వాడుకోనివ్వకుండా పెత్తనం చేయాలని చూస్తోంది. ఈ ఫండ్స్ వైద్య, ఆరోగ్య రంగానికే ఖర్చు చేయాలని, కలెక్టర్ల అకౌంట్ బదిలీ చేస్తూ తీర్మానం చేయాలని జడ్పీలకు సూచించింది. నిధులను బదిలీ చేసేందుకు జడ్పీ చైర్మన్లు ససేమిరా అనడంతో సీఈఓల మీద ఒత్తిడి తెచ్చి అవి ఖర్చు చేయకుండా కొర్రీలు పెడుతోంది. దాదాపు 20 జిల్లా పరిషత్‌లలో నిధులు కలెక్టర్ ఖాతాకు మల్లించాలని తీర్మానాలు చేయలేదు. దీంతో కోట్ల రూపాయలు జడ్పీ ఖాతాల్లోనే మూలుగుతున్నాయి.
సీఈఓల మీద ఒత్తిళ్లు.. లీడర్ల మధ్య గొడవలు..
ఆయా జిల్లాల్లో జనాభాను బట్టి ఒక్కో జిల్లా పరిషత్‌కు దాదాపు రూ. 2కోట్ల వరకు 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు వచ్చాయి. నాలుగు నెలల కింద ఈ ఫండ్స్జడ్పీ ఖాతాల్లో జమయ్యాయి. ఈ నిధులను గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం ఖర్చు చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్లు భావించగా.. ప్రభుత్వం మాత్రం వైద్య, ఆరోగ్య శాఖ అవసరాల కోసం కలెక్టర్ల అకౌంట్లకు బదిలీ చేయాలని జడ్పీ సీఈఓ లకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో జడ్పీల్లో చైర్ పర్సన్లు, సీఈఓల మధ్య కోల్డ్‌వార్ కొనసాగుతోంది. నిధులు మళ్లించేందుకు జడ్పీ జనరల్ బాడీ మీటింగ్ లో మెజార్టీ సభ్యుల ఆమోదంతో తీర్మానం చేయాలి. ఒకే శాఖ కు మొత్తం ఎలా ఇస్తామంటూ 20 కి పైగా జడ్పీల్లో చైర్పర్సన్లు తీర్మానాలు చేయకుండా పెండింగ్ లో పెట్టారు. ఇటీవల జరిగిన వనపర్తి జడ్పీ జనరల్ బాడీ మీటింగ్‌లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వనపర్తి జడ్పీ చైర్పర్సన్ లోకనాథ్ రెడ్డి మధ్య ఈ అంశం మీద వాదోపవాదాలు జరిగాయి. జడ్పీ సీఈఓ వెంకట్ రెడ్డి మంత్రి ఆదేశాలతో రూ. 14 లక్షలు కలెక్టర్ అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేశారు. ఈ ఫండ్స్ జిల్లాకు కొత్తగా మంజూరైన మెడికల్ కాలేజీలో ఆశా వర్కర్ల శిక్షణ కోసం, డీఎంహెచ్ఓ పరిధిలో హెచ్ఎంబీసీ ట్రైనింగ్ ప్రోగ్రాం కోసం వాడుకున్నట్టు కలెక్టర్ షేక్ యాస్మీన్ బాషా చెప్పారు. ఫైనాన్స్ కమిషన్ నిధులను ఒకే శాఖకు ఎలా బదిలీ చేస్తారంటూ కలెక్టర్‌తో లోకనాథ్ రెడ్డి గొడవ పడ్డారు. ప్రజలకు ఎన్నో హామీలిచ్చి గెలిచామని, వారి కనీస అవసరాలు కూడా తీర్చలేకపోతున్నామని, ఇలాంటి పరిస్థితిలో జడ్పీ కి వచ్చిన కొద్దిపాటి నిధులనూ మళ్లించడాన్ని ఆయన వ్యతిరేకించారు. ఫండ్స్మళ్లించడాన్ని ఒప్పుకునేదే లేదని, తప్పు చేసిన అధికారులను జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. జనరల్ ఫండ్స్ వినియోగించుకునేందుకే జడ్పీలకు పూర్తి అధికారాలున్నాయని, ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ ను ఆస్పత్రుల్లో మౌలిక వసతులకోసం వాడుకోవచ్చన్న క్లాజ్ ఉందని మంత్రి నిరంజన్ రెడ్డి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎలాంటి తీర్మానం లేకుండానే ఆ ఫండ్స్ వాడుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుందన్నారు. ఫండ్స్ నేరుగా హెల్త్ డిపార్ట్ మెంట్ కు వెళ్లలేదని, కలెక్టర్ ఖాతాకు బదిలీ చేయగా.. అవసరాలను బట్టి ఖర్చు చేశారని చెప్పినా జడ్పీ మెంబర్లు సంతృప్తి చెందలేదు.
కంటి వెలుగుకు మళ్లించే యత్నం
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు పథకానికి ప్రభుత్వం పైసా ఇవ్వలేదు. గ్రామాల్లో ఐ క్యాంపుల ఏర్పాటుకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మాత్రమే ప్రభుత్వం ఇస్తోందని డీఎంహెచ్ ఓలు చెప్తున్నారు. మిగతా ఖర్చులన్నీ ఫైనాన్స్ కమిషన్ నిధుల నుంచి వాడుకోవాలని చూస్తోందని జడ్పీ చైర్పర్సన్లు ఆరోపిస్తున్నారు.
గెలిచినందుకు పనులు చేయొద్దా..
ఫైనాన్స్ కమిషన్ నిధులను ట్రాన్స్ఫర్ చేసేందుకు మెజారిటీ చైర్మన్లు అంగీకరించలేదు. తీర్మానం చేసేది లేదంటూ తేల్చేశారు. దీంతో ప్రభుత్వం నిధులను ఫ్రీజ్ చేయాలని సీఈఓ లకు ప్రభుత్వం నోటి మాట గా ఆదేశాలు జారీ చేసింది. అకౌంట్లలో రూ. 2కోట్ల వరకు ఫండ్స్ వాడుకునేందుకు వీలు లేకుండా చేసిందని వాపోతున్నారు. తమకు నెలకు రూ. లక్ష వరకు జీతం, వాహనాలు కేటాయించిన ప్రభుత్వం తమ అధికారాలను మాత్రం కట్ చేస్తోందని, కల్యాణలక్ష్మి, షాదిముబారక్ , సీఎం రిలీఫ్ ఫండ్ , ఫించన్లు , రైతుబంధులాంటి సంక్షేమ పథకాలు తప్ప గ్రామాల్లో ఏ పనులు చేయలేకపోతున్నామన్నారు. స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్, జనరల్ ఫండ్ తో మండలానికి ఒకటి, రెండు పనులు కూడా ఇవ్వలేకపోతున్నామని, ప్రజలు తమ మీద నమ్మకంతో గెలిపించినందకు ఒక్క పనైనా చేయొద్దా అని వాపోతున్నారు. రోడ్లు తదితర కనీస వసతులు కల్పించేందుకు నిధులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యేల పెత్తనంపై ఫైర్
చాలా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలకు.. జడ్పీ చైర్పర్సన్లకు పడడంలేదు. ప్రొటోకాల్వివాదాలు, ఆధిపత్య పోరు కొనసాగుతోంది. కొన్ని చొట్ల జడ్పీ చైర్పర్సన్లు సర్దుకుపోతుండగా చాలా చోట్ల ఎమ్మెల్యేల పెత్తనం మీద రుసరుసలాడుతున్నారు. అధికారులు జడ్పీ చైర్పర్సన్లకు ప్రయారిటీ ఇవ్వడం, మంత్రులు, ఎమ్మెల్యేలకు నచ్చడం లేదు. తాము లేకుండా, తమకు తెలియకుండా జడ్పీ చైర్పర్సన్లు తమ నియోజకవర్గాల పరిధిలో తిరగడాన్ని ఎమ్మెల్యేలు సహించడంలేదు. దీంతో చాలా చోట్ల ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్పర్సన్ల మధ్య రాజుకుంటున్న విభేదాలు అధికార పార్టీకి సవాల్‌గా మారుతున్నాయి.