హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీలో డివిజన్ కమిటీలను ఎన్నుకోవడం లేదు. వార్డు స్థాయి పాలన మొదలు పెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం.. ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా నిలిచే డివిజన్కమిటీలను నియమించడం లేదు. యాక్ట్ ప్రకారం కౌన్సిల్ ఏర్పడిన తర్వాత పాలనలో జనాల భాగస్వామ్యం మరింత పెంచేందుకు డివిజన్ కమిటీలను ఏర్పాటు చేయాలి. కౌన్సిల్ ఏర్పడిన తర్వాత ఎంపిక ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంది. కానీ గ్రేటర్ ఎన్నికలు జరిగి రెండేళ్లు గడిచినా ఈ కమిటీలను నియమించడం లేదు. 2019లో చట్ట సవరణ తర్వాత డివిజన్ కమిటీ ఎన్నికకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇవ్వడం లేదు. దీంతో డివిజన్ కమిటీల నియామకం మూలనపడింది. ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ రాకపోవడంతో అధికారులు కూడా ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు.
సర్కిల్ అధికారులు, సిటిజన్ల మధ్య వారధిగా..
డివిజన్ కమిటీలను నియమిస్తే ప్రజా సమస్యలు త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కొద్ది రోజుల్లో డివిజన్ స్థాయిలో పాలన మొదలవుతుండటంతో అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది. డివిజన్‌కు ఒక్క కార్పొరేటర్ ఉంటే.. వంద మంది డివిజన్ కమిటీ సభ్యులు ఉండాల్సి ఉంటుంది. ఈ సభ్యులు డివిజన్ అభివృద్ధికి సంబంధించి సలహాలు, సూచనలు ఇస్తూనే ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించేందుకు సర్కిల్ అధికారులు, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తారు. ప్రతి నెలా వార్డు లెవెల్లో జరిగే సమావేశంలో సమస్యలపై చర్చించుకుంటారు. సమస్యలను కార్పొరేటర్ పట్టించుకోకపోయినా తమ తమ కాలనీల్లోనే ఉండే డివిజన్ కమిటీ సభ్యులను అడిగేందుకు సిటిజన్లకు అవకాశం ఉంటుంది.
నెరవేరని కమిటీల లక్ష్యం
ఆయా కాలనీల్లో నివాసముండే సీనియర్ సిటిజన్లు, యువత, అసోసియేషన్లు, సొసైటీ తదితరులు డివిజన్ కమిటీ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. కార్పొరేటర్ల ఎన్నిక అయిన మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది. కానీ ఏడాదిన్నర గడిచినా ఈ ప్రక్రియకి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గ్రేటర్‌లో 150 వార్డులుండగా.. ఒక్కో డివిజన్ కమిటీలో100 మంది సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. అంటే గ్రేటర్‌లో 15 వేల సభ్యులను ఎన్నుకునే అవకాశం ఉంది. కానీ ప్రతిసారీ నామమాత్రంగా 10 నుంచి 15 మందిని ఎన్నుకొని వదిలేస్తున్నారు. దీంతో కమిటీల లక్ష్యం నెరవేరడం లేదు.
ముందు డివిజన్ కమిటీలనే నియమించాలి
డివిజన్ పాలన కంటే ముందు డివిజన్ కమిటీలను నియమించాలె. డివిజన్ స్థాయిలో ఉండే అధికారులతో కలిసి ఈ కమిటీలు పనిచేసేందుకు వీలుంటుంది. అన్ని విషయాల్లో చట్టంలో ఉన్నట్టుగానే చేస్తున్నామని చెబుతున్న అధికార పార్టీ.. డివిజన్ కమిటీలను ఎందుకు నియమించడం లేదు. డివిజన్ కమిటీలుంటే జనం సమస్యలు మరింత త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి.
.
బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, కార్పొరేటర్, గడ్డి అన్నారం డివిజన్