- ఆఫీసర్ల కేటాయింపు, ఆఫీసుల ఏర్పాటు వివరాలు అందజేయాలని కమిషనర్ఆదేశాలు
- ఇదే అంశంపై గురువారం ఉన్నతాధికారులతో చర్చ
- సిబ్బందిని నియమించకుండా ఉన్నవారితో నెట్టుకురావడం కష్టమంటున్న కొందరు అధికారులు
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్పరిధిలో డివిజన్ లెవెల్పాలన అందించేందుకు జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తుంది. మొత్తం 150 డివిజన్ల(వార్డులు)లో అన్ని విభాగాల అధికారులతో సేవలు అందించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరులోపు ఆఫీసుల ఏర్పాటుతో ఆఫీసర్లకి బాధ్యతలు అప్పగించేందుకు కమిషనర్ లోకేశ్కుమార్సన్నాహాలు చేస్తున్నారు. 10 రోజుల్లో డివిజన్ ఆఫీసులను ముస్తాబు చేసి బోర్డులు ఏర్పాటు చేయాలని, ఏ వార్డుకు ఎవరిని నియమిస్తారనే వివరాలు అందజేయాలని అన్ని విభాగాల హెచ్వోడీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశమై గురువారం బల్దియా హెడ్డాఫీస్లో అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లతో కమిషనర్ లోకేశ్ సమావేశం నిర్వహించారు. డివిజన్ లెవెల్ పాలన అందించేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలు అందినప్పటి నుంచి మిగతా పనులు పక్కన పెట్టి జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఇదే పనిలో పడ్డారు. జూన్2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా డివిజన్ఆఫీసుల నుంచి పాలన మొదలు పెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రతి వార్డు ఆఫీసులో బల్దియాకి చెందిన అన్ని విభాగాలతోపాటు విద్యుత్, వాటర్బోర్డు అధికారులు అందుబాటులో ఉండనున్నారు.
సర్కిళ్లు దూరమవుతున్నాయనే..
ప్రస్తుతం గ్రేటర్లో 30 సర్కిళ్లు, 6 జోనల్ ఆఫీసులు ఉన్నాయి. ఇదంతా కమిషనర్ పరిధి కింద ఉండేది. గతంలో అన్ని నిర్ణయాలను జీహెచ్ఎంసీ
హెడ్డాఫీస్ కేంద్రంగానే తీసుకునేవారు. కొన్నేండ్ల కింద అభివృద్ధి పనులు త్వరగా కావాలనే ఆలోచనతో, డీ సెంట్రలైజేషన్ పేరుతో జోనల్ స్థాయిలో నిర్ణయాలు తీసుకునే అధికారం ఇచ్చారు. అప్పటి నుంచి సర్కిల్పరిధిలో ఉండే డిప్యూటీ కమిషనర్ జోనల్ కమిషనర్ అండర్లో పనిచేస్తున్నారు. జనాభా క్రమంగా పెరుగుతుండటంతో సర్కిల్ ఆఫీసులకు డైలీ సమస్యలతో వచ్చేవారు ఎక్కువవుతున్నారు. దీంతో ప్రభుత్వ సేవలను మరింత దగ్గర చేయాలనే ఉద్దేశంతో డివిజన్ లెవెల్ పాలన అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆలోచన బాగానే ఉన్నప్పటికీ అధికారులు, సిబ్బందిని నియమించిన తర్వాత డివిజన్ లెవెల్ పాలన మొదలు పెడితే బాగుంటుందని కొందరు జీహెచ్ఎంసీ అధికారులే అభిప్రాయ పడుతున్నారు.
తలలు పట్టుకుంటున్న అధికారులు
అధికారులు, సిబ్బంది కొరతతో ఇప్పటికే పనులు సక్రమంగా కావడంలేదు. ఈ క్రమంలో డివిజన్లెవెల్ పాలనకు అధికారులను కేటాయించాలని హెచ్వోడీలకు ఆదేశాలు అందడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. 30 సర్కిళ్లలో సరిపడా స్టాఫ్ లేక కొన్ని నెలలుగా పనులు పెండింగ్ పడుతున్నాయి. ఈ టైంలో150 వార్డులకు ఆఫీసర్లని కేటాయించడం కష్టమైన పని అని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఒక్కో వార్డుకు 10 మంది ఆఫీసర్ల లెక్కన మొత్తం 1,500 మంది వరకు అవసరం ఉంది. అయితే కొన్ని విభాగాల్లో ఇతరులకు బాధ్యతలు ఇచ్చి నెట్టుకొచ్చేందుకు వీలు ఉంది. టౌన్ ప్లానింగ్, హెల్త్ విభాగంలో మాత్రం ఇప్పటికే సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది.
ఏఎంసీలు 85 మందే ఉన్నరు
అన్ని డివిజన్లలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్(ఏఎంసీ)లకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించనున్నట్లు మంత్రి కేటీఆర్ నిర్వహించిన రివ్యూ మీటింగ్లో నిర్ణయించారు. వీరు అన్ని విభాగాల అధికారులతో కో ఆర్డినేట్ చేసుకుంటూ డివిజన్ఆఫీసును మెయింటెన్ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 85 మంది ఏఎంసీలే ఉన్నారు. ఈ లెక్కన చూస్తే మరో 65 మంది అవసరం ఉంది. అయితే మిగిలిన చోట్ల ఏఎంసీల స్థానంలో సూపరింటెండెంట్లకు బాధ్యతలు అప్పగిస్తారా? లేదా ఇంకెవరికైనా అప్పగిస్తారా అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.