- ఇదంతా డీఎఫ్ఓ మాయా.. ? లేక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యమా?
- ఏనుగు వచ్చాక ఆసిఫాబాద్ రేంజర్ కు కాగజ్ నగర్ బాధ్యతలు
- ఇప్పటికీ కనిపించని రెండు పులుల జాడ
ఆసిఫాబాద్ / కాగజ్ నగర్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు రెగ్యులర్ఎఫ్డీఓలు కరవయ్యారు. ఆసిఫాబాద్ డివిజన్ కు ఆరు నెలలుగా, కాగజ్ నగర్ కు నాలుగు నెలలుగా డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్లు లేరు. పులుల ఆవాసంగా ఉన్న ఈ ప్రాంత పర్యవేక్షణకు ఎఫ్ డీఓ పోస్టులు చాలా కీలకం. అయినా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
రెండు పులులు మృతి.. కనిపించని మరో రెండింటి జాడ
ఈ ఏడాది జనవరిలో వేటగాళ్లు పెట్టిన విషాహారం తిని కాగజ్నగర్డివిజన్ పరిధిలో రెండు పులులు చనిపోవడం తీవ్ర కలకలం రేపింది. ఆ తర్వాత మరో రెండు పులుల జాడ ఇప్పటికీ కనిపించలేదు. పులుల మృతి ఘటనకు బాధ్యులుగా పేర్కొంటూ అప్పటి ఎఫ్ డీఓ వేణు బాబు, ఎఫ్ ఆర్ఓ వేణుగోపాల్, ఎఫ్ ఎస్ఓ పోశెట్టిని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్ఓ) గా ఉన్న నీరజ్ కుమార్ టిబ్రేవాల్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. నాలుగు నెలల పాటు ఆయనే బాధ్యతలు నిర్వహించారు.
వారిని కనీసం టచ్ కూడా చేయలేదు
జనవరిలో రెండు పులులు మృతి చెందిన ప్రాంతానికి ఆనుకొనే ఆసిఫాబాద్ రేంజ్ ఉంది. కేవలం కొన్ని వందల మీటర్ల వ్యత్యాసంలో ఈ ఘటన జరిగింది. పులులకు విషం ఇచ్చి చంపిన నిందితులు కూడా ఆసిఫాబాద్ రేంజ్ లోని రెంగరేట్ గ్రామానికి చెందిన వాళ్లే కావడం గమనార్హం. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో ఎక్కడ ఘటన జరిగిందో వాళ్లే బాధ్యలంటూ కాగజ్ నగర్ అధికారుల మీద సస్పెన్షన్ వేటు వేశారు. నిందితులు ఉన్న ప్రాంతంలోని వారిని కనీసం టచ్ కూడా చేయలేదు. రెంగారేట్ ప్రాంతం ఉన్న అటవీ రేంజ్ సహా ఏ ఒక్కరి మీద కనీసం చర్యలు తీసుకోలేదు.
పైగా ఆసిఫాబాద్ డివిజన్ కు డీఎఫ్ ఓ నీరజ్ కుమార్ ఇన్ చార్జ్ గా ఉండగా అక్కడి సిబ్బంది మీద యాక్షన్ తీసుకుంటే ఆయన మీద కూడా పర్యవేక్షణ లోపం ఉన్నట్లు బయటపడుతుందని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారన్న వాదన వినిపిస్తోంది. ఇప్పుడు అదే రేంజ్ ఆఫీసర్ కి కాగజ్ నగర్ డివిజన్ అదనపు బాధ్యతలు ఇవ్వడం పట్ల భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.రెగ్యులర్ ఎఫ్ డీఓలు వస్తే తన ప్రాబల్యం తగ్గుతుందని డీఎఫ్ఓ అడ్డు పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదే సమయంలో పులుల మృతి ఘటనపై ఇప్పటికీ విచారణ సాగుతుండగా.. ఎటువంటి ఇబ్బందీ రాకుండా ముందు జాగ్రత్తగా తనకు అందుబాటులో ఉండే రేంజ్ ఆఫీసర్ కు అదనపు బాధ్యతలు ఇచ్చారన్న వాదన వినిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలోనే పేరున్న ఆసిఫాబాద్ జిల్లా అడవుల రక్షణకు అటవీ శాఖ మంత్రి, ఉన్నతాధికారులు వెంటనే డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్ లను నియమించి పులులు, వన్యప్రాణులు,అడవులను కాపాడాల్సిన అవసరం ఉంది.
ఏనుగు వచ్చాక నిద్రలేచారా?
మహారాష్ట్ర నుంచి వచ్చిన ఏనుగు హల్ చల్ చేసి కాగజ్ నగర్ డివిజన్ లో ఇద్దరు రైతుల ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో స్థానికంగా డివిజన్ ఆఫీసర్ లేకపోవడంతో డీఎఫ్ ఓ వచ్చేదాకా ఆయన ఆదేశాల కోసం కింది స్థాయి అధికారులు వేచి చూసే పరిస్థితి వచ్చింది. అదే స్థానిక అధికారి ఉంటే ప్రాణనష్టం తగ్గేదని అటవీ సిబ్బంది చెబుతున్నారు. ఈ విషయాన్ని తమ జిల్లా బాస్ కు మాత్రం చెప్పే సాహసం చేయడం లేదు. ఆ తర్వాత హడావుడిగా ఎఫ్ డీఓ బాధ్యతలు ఆసిఫాబాద్ రేంజ్ ఆఫీసర్ గా కొనసాగుతున్న అప్పల కొండకు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.