ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డ్ విజేత ఏఆర్ రెహమాన్, ఆయన సతీమణి సైరా బాను దాంపత్య జీవితానికి ముగింపు పలికారు. తన భర్త ఏఆర్ రెహమాన్‌తో విడాకులు తీసుకున్నట్లు సైరా బాను ప్రకటించారు. ఈ మేరకు 2024, నవంబర్ 19 మంగళవారం సైరా బాను తరుఫు న్యాయవాది ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో విడాకులకు గల కారణాలను ప్రస్తావించారు. ‘‘పెళ్లయిన 29 సంవత్సరాల తర్వాత సైరా తన భర్త ఏఆర్ రెహమాన్ నుండి విడిపోవడానికి చాలా కష్టమైన నిర్ణయం తీసుకుంది. వారి దాంపత్య జీవితంలో నెలకొన్న ఒడిదుడుకుల కారణంగా నిర్ణయం తీసుకున్నారు. ఒకరిపై ఒకరికి గాఢమైన ప్రేమ, మర్యాద ఉన్నప్పటికీ.. వివాహ బంధంలో నెలకొన్న ఉద్రిక్తతలు, ఇబ్బందులు వారి మధ్య అధిగమించలేని అంతరాన్ని సృష్టించడంతో వివాహ దాంపత్య జీవితానికి గుడ్ బై చెప్పారు.
ALSO READ | Kona Venkat: అందుకే నాగార్జున కింగ్ సినిమా ఫ్లాప్ అయ్యింది..
కలిసే ఉండేందుకు చివరి వరకు ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు.. దీంతో విడిపోవాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. సైరా బానుకి ఇది కఠినమైన సమయం. ఈ కష్టకాలంలో తన వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని బాను ప్రజలకు విజ్ఞప్తి చేశారు’’ అని ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, సైరా బాను జోడికి 1995లో చెన్నైలో వివాహం జరిగింది. వీరికి ఖతీజా, రహీమా, అమీనా ముగ్గురు పిల్లలు ఉన్నారు. వ్యక్తిగత విభేదాల కారణంగా 29 ఏళ్ల వివాహ బంధానికి పుల్ స్టాప్ పెట్టి.. ఇక విడిపోవాలని ఏఆర్ రెహమాన్, సైరా బాను నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో సైరా మంగళవారం అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు.