యాదాద్రిలో దివ్యవిమాన స్వర్ణగోపుర .. మహాకుంభాభిషేక సంప్రోక్షణ షురూ

యాదాద్రిలో దివ్యవిమాన స్వర్ణగోపుర .. మహాకుంభాభిషేక సంప్రోక్షణ షురూ

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనారసింహుడి దివ్యవిమాన స్వర్ణగోపుర కుంభ సంప్రోక్షణ మహాక్రతువు బుధవారం ప్రారంభమైంది. వానమామలై పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామి నిర్ణయించిన ముహూర్తం ప్రకారం సప్తాహ్నిక పంచకుండాత్మక మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలకు ఆలయ అర్చకులు శ్రీకారం చుట్టారు. మహాకుంభ సంప్రోక్షణ పూజల్లో భాగంగా యాగశాలలో పంచకుండాత్మక సుదర్శన యాగంతో స్వర్ణగోపుర ఉద్ఘాటన పర్వాలకు తెరలేచింది.

ఉత్సవాలకు అంకురార్పణ..

ఆలయంలో స్వామివారికి నిత్య ఆరాధనల అనంతరం మహాకుంభ సంప్రోక్షణ పూజల్లో భాగంగా..‌గర్భగుడిలో భగవత్  ఆజ్ఞ తీసుకుని.. పాంచరాత్ర ఆగమ శాస్త్రం పద్ధతిలో ఉదయం 7:45కు ప్రధానాలయ ముఖ మండపంలో అర్చకులు స్వస్తివాచనంతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. అనంతరం లక్ష్మీసమేత నారసింహుడిని ప్రత్యేక అలంకారంలో ప్రధానాలయం నుంచి యాగశాల వరకు తిరువీధి సేవ చేపట్టి.. యాగశాల ప్రవేశం గావించారు.

వానమామలై రామానుజ జీయర్  స్వామి పర్యవేక్షణలో ఆలయ ప్రధానార్చకులు నల్లంథీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యుల ఆధ్వర్యంలో అర్చకులు పుణ్యాహవచనం, విశ్వక్సేనపూజ, రక్షాబంధనం, పంచగవ్య ప్రాశన రిత్విక్ వరణం, అగ్నిప్రతిష్ట, అఖండ దీపారాధన, సద్యాంకురార్పణ, ద్వారతోరణ ధ్వజకుంభారాధన, మూలమంత్ర, మూర్తిమంత్ర హోమ పూజలతో పంచకుండాత్మక సుదర్శన యాగానికి శ్రీకారం చుట్టారు.

108 మంది పారాయణీకులు, రుత్వికులు, వేదపండితులు పాల్గొనగా.. పారాయణీకుల పారాయణాలు, వేదపండితుల వేదపారాయణాల మధ్య సప్తాహ్నిక పంచకుండాత్మక సుదర్శన యాగం మొదలైంది. సుదర్శన యాగం ఐదు రోజుల పాటు జరగనుంది. 23న ఉదయం 11:45 గంటలకు మహాకుంభ సంప్రోక్షణ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆలయ దివ్యవిమాన స్వర్ణగోపుర ఉద్ఘాటన చేసి స్వర్ణగోపురాన్ని స్వామివారికి అంకితం చేయనున్నారు.

శాస్త్రోక్తంగా జలాధివాసం..

సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక పూజల అనంతరం ఆలయ శిఖరాలపై అలంకరించే బంగారు కలశాలకు జలాధివాసం ఉత్సవాన్ని చేపట్టారు. ఆగమ పద్దతిలో జలాధివాసం నిర్వహించారు. జలాధివాసంలో కలశాలను అధిష్టింపజేయడం ద్వారా.. కలశాలకు ఉన్న సర్వదోషాలు తొలగి పవిత్రత చేకూరుతుందని అర్చకులు తెలిపారు. జలాధివాసం అనంతరం యాగశాలలో నిత్య పూర్ణాహుతి నిర్వహించి స్వామివారి తిరువీధి సేవ 
చేపట్టారు.