- సూర్యాపేట జిల్లాలోని మోతె మండల కేంద్రంలో ఘటన
మోతె(మునగాల), వెలుగు : తన భర్త పేరిట ఉన్న భూమిని తమకు తెలియకుండానే రిజిస్ట్రేషన్ చేసిన తహసీల్దార్‌పై చర్యలు తీసుకొని న్యాయం చేయాలంటూ దివ్యాంగ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. బాధితురాలు తెలిపిన ప్రకారం.. మోతె మండలం నామవరం శివారులో పూలమ్మ భర్త మట్టపెల్లి వెంకటాచలం పేరిట సర్వే నం. 701/2 , 608/3, 607/1, 701/2/3, 607/2 లో సుమారు 7 ఎకరాల 10 గుంటల భూమి ఉంది.
కొంతకాలం కిందట వెంకటాచలం చనిపోగా.. ఆయన పేరిట ఉన్న భూమిని మొదటి భార్య కూతురు కొమ్మ రమణ వద్ద తహసీల్దార్ సంఘమిత్ర రూ. లక్షలో డబ్బులు తీసుకుని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిందని పూలమ్మ ఆరోపించారు. వెంకటాచలం కొడుకు రఘు, చెల్లి లింగమ్మ లేకుండానే రిజిస్ట్రేషన్ చేసిన తహసీల్దార్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది. దివ్యాంగురాలినైన తనకు కలెక్టర్ న్యాయం చేయాలని బాధితురాలు పూలమ్మ కోరింది.
తన భర్త పేరిట ఉన్న భూమిలో రావాల్సిన వాటాను ఇప్పించాలని, లేకుంటే తనకు, తన కొడుకుకు చావే మార్గమని విలపించింది. తహసీల్దార్ పట్టించుకోకుండా స్థానిక పోలీసులతో ఆఫీసును వెళ్లగొట్టేందుకు యత్నించగా.. పూలమ్మ ఆఫీస్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా పలువురు అడ్డుకున్నారు.