భిన్నత్వంలో ఏకత్వం దీపావళి

భిన్నత్వంలో ఏకత్వం దీపావళి

దీపావళి అంటే దీపాల వరుస, దీపం జ్ఞానానికి చిహ్నం.. అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించే ఆయుధం. విజయానికి ప్రతీక.. కొత్తకాంతికి ప్రతిరూపం. అజ్ఞాన తిమిరాల నుంచి జ్ఞానం వైపు పయనింపజేసే మార్గదర్శి. ధనత్రయోదశి నుంచి మొదలై.. భాయ్ దూజ్ తో ముగుస్తుంది. ఒక్క ప్రాంతంలో ఒక్కో విధంగా దీపావళి సంబురాలను జరుపుకొంటారు.

గుజరాతీల కొత్త సంవత్సరం

దీపావళి గుజరాతీలకు నూతన సంవత్సరం, కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి గుజరాత్ ప్రజలకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. కొత్త ఖాతా పుస్తకాలను తెరవడానికి పాత ఖాతా పుస్తకాలను మూసివేసే సమయం కూడా ఇదే. సంప్రదాయ లెడ్జర్లాను చోప్రా అంటారు. ఈ రోజున, ప్రజలు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ స్వీట్లు పంచుతారు.

మహారాష్ట్రలో భాయ్ దూజ్

దీపావళి పండుగ మహారాష్ట్రీయులకు ప్రత్యేకం. ఇక్కడి ప్రజలు దీపావళి మరుసటి రోజు బలిపాడ్యమి నిర్వహిస్తారు. ఆ తర్వాతి రోజు బాయ్ దూజ్ జరుపుకొంటారు. దీనినే యమద్వితీయ అని కూడా అంటారు. యమధర్మరాజు ఈ రోజున తన సోదరి యుమున ఇంటిని సందర్శించి సోదరి చేతి భోజనం చేస్తారని చెబుతారు.

తన సోదరుడు ఇంటికి వచ్చినప్పుడు యమున స్వాగతం పలికి తిలకం దిద్దుతుందని చెబుతున్నారు. దీనినే పశ్చిమ బెంగాల్ లోని భాయ్ ఫోటో, తెలగు రాష్ట్రాల్లో యమద్వితీయగా పిలుస్తారు. ఉత్తరప్రదేశ్, బీహార్ లోని వివిధ ప్రాంతాలలో దీనిని భ్రాత్రి ద్వితీయ అని పిలుస్తారు. ఎలా పిలిచినా ఈ రోజు ప్రత్యేకత సోదరి ఇంట్లో విందును ఆరగించడమే.

తమిళనాడులో తలై దీపావళి

తమిళనాడులో, నూతన వధూవరులు తలై దీపావళి పండుగను జరుపుకుంటారు. వివాహం తర్వాత పుట్టింట్లో జరిగే మొదటి దీపావళి వేడుకలు ఇవి. చాలా ఆనందంగా ఉత్సాహంగా వేడుకలు చేసుకుంటారు. పెళ్ళయిన తర్వాత తొలిసారిగా కూతురు పండుగకు వచ్చిన సందర్భంగా అల్లుడు, కూతురికి ప్రత్యేకంగా బహుమతులు ఇచ్చి ఆశీర్వదిస్తారు.