Diwali 2024: టపాసులు కాల్చడంపై పలు రాష్ట్రాలలో నిషేధం

Diwali 2024: టపాసులు కాల్చడంపై పలు రాష్ట్రాలలో నిషేధం

దీపావళి రోజు టపాసులు కాలుస్తూ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా..! అయితే, మీకో బ్యాడ్‌న్యూస్. గాలి కాలుష్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, పలు రాష్ట్రాలు దీపావళికి టపాసులు కాల్చడాన్ని పూర్తిగా నిషేధించాయి. పర్యావరణ సమస్యలను కారణాలుగా చూపుతూ ఢిల్లీ, పంజాబ్, హర్యానా, తమిళనాడు రాష్ట్రాలు బాణసంచా కాల్చడంపై కఠిన నిబంధనలు తీసుకొచ్చాయి. ఈ నిషేధం కొన్ని రాష్ట్రాలలో పరిమిత స్థాయిలో ఉండగా.. మరికొన్ని రాష్ట్రాలలో పూర్తిగా ఉంది.   

ఢిల్లీలో పూర్తి నిషేధం

చలికాలం వచ్చిందంటే, ఢిల్లీలో గాలి నాణ్యత బాగా క్షీనిస్తుంది. పది మీటర్ల దూరంలో ఉన్న మనిషి సైతం కంటికి కనిపించరు. ఆ స్థాయిలో పొగ కమ్మేస్తుంది. ఇలాంటి పరిస్థితులలో దీపావళి పేరుతో బాణాసంచా కాలిస్తే, వాయు కాలుష్యం మరింత విజృంభిస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ప్రభుత్వం టపాసుల వినియోగంపై పూర్తి నిషేధం విధించింది. కాకపోతే, ఢిల్లీ- ఎన్‌సీఆర్‌ పరిధిలో అక్టోబరు 31న అంటే దీపావళి నాడు సాయంత్రం 8 నుంచి 10 గంటల మధ్య గ్రీన్‌ టపాసులు కాల్చుకునేందుకు అనుమతినిచ్చింది.

బీహార్‌లో ఏవీ కాల్చకూడదు

పర్యావరణ పరిరక్షణకు బీహార్ ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. బీహార్‌లోని పాట్నా, గయా, ముజఫర్‌పూర్, హాజీపూర్ వంటి ప్రధాన నగరాల్లో గ్రీన్ క్రాకర్స్ సహా అన్ని రకాల టపాసులను పూర్తిగా నిషేధించారు.

మహారాష్ట్ర, కర్ణాటకలో గ్రీన్ క్రాకర్స్‌కు అనుమతి

మహారాష్ట్ర, కర్నాటక ప్రభుత్వాలు బాణాసంచాపై పూర్తి నిషేధం విధించాయి. అయితే, సాంప్రదాయ వాటి కంటే 30 శాతం తక్కువ కాలుష్య ఉద్ఘారాలను విడుదల చేసే గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవడానికి అనుమతినిచ్చాయి.

హైదరాబాద్‌లోనూ నిషేధాజ్ఞలు

ఇదిలావుంటే, భారీ శబ్ధం వచ్చే టపాసులు కాల్చడంపై హైదరాబాద్ నగర పోలీసులు నిషేధం విధించారు. దీపావళి రోజున బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై అధిక ధ్వనిని పుట్టించే క్రాకర్లను కాల్చడాన్ని నిషేధిస్తూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. నగర వాసులు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకే బాణసంచా కాల్చడానికి అనుమతించారు. అదే సమయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన డెసిబెల్ నిబంధనలు అతిక్రమించరాదని హెచ్చరించారు. ఆదేశాలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ALSO READ | Diwali 2024 : పటాకులతో పిల్లలు జాగ్రత్త.. ఈ ప్రమాదాలు జరిగే అవకాశం..!