- 30 వేల నుంచి 40 వేల వరకు టూ వీలర్లు, 10 నుంచి 15 వేల వరకు ఫోర్ వీలర్ల బుకింగ్
- రవాణా శాఖకు మొత్తం రూ.240 కోట్ల వరకు ట్యాక్స్ ఆదాయం!
హైదరాబాద్, వెలుగు: దసరా, దీపావళి పండుగలు రవాణా శాఖకు కిక్ ఇస్తున్నాయి. ఈ పండుగల సందర్భంగా కొత్త వాహనాల కొనుగోళ్లతో రవాణా శాఖకు ట్యాక్స్ రూపంలో భారీ ఆదాయం చేకూరనుంది. అయితే గత దసరాతో పోల్చితే ఈ దసరాకు అనుకున్న స్థాయిలో వెహికల్స్ కొనుగోళ్లు జరగకపోవడంతో దీపావళిపైనే షోరూం యజమానులు, రవాణా శాఖ అధికారులు ఆశలు పెట్టుకున్నారు.
దీపావళి రానుండడంతో దసరాకు ముందు బుకింగ్ చేసుకున్న కొత్త వాహనాలను దీపావళికి తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ దీపావళికి రాష్ట్రవ్యాప్తంగా 10 నుంచి 15 వేల వరకు ఫోర్ వీలర్స్(కార్లు), 30 వేల నుంచి 40 వేల వరకు టూ వీలర్స్ రోడ్లపైకి రానున్నట్లు రవాణా శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో 60 నుంచి 70 శాతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే బుకింగ్ అయినట్లు కంపెనీ షోరూంల యజమానులు చెప్తున్నారు.
భారీగా ట్యాక్స్ ఆదాయం..
రాష్ట్రంలో 30 వేల నుంచి 40 వేల టూ వీలర్స్ కొనుగోళ్లు జరిగితే రవాణా శాఖకు ట్యాక్స్ రూపంలో సుమారు రూ.40 కోట్లపైనే ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 10 వేల నుంచి 15 వేల వరకు ఫోర్ వీలర్స్ కొనుగోళ్లు జరిగితే సుమారు రూ.200 కోట్ల ట్యాక్స్ ఆదాయం రానుందని చెబుతున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలతో పాటు మిగతా చోట్ల కూడా భూముల క్రయ విక్రయాల్లో జోరు తగ్గడం, రియల్ ఎస్టేట్ రంగం గతంతో పోల్చితే ఈ దసరా, దీపావళికి అనుకున్న స్థాయిలో లేకపోవడంతో ఈసారి కొత్త వెహికల్స్ కొనుగోళ్లు తగ్గాయని షోరూం యజమానులు, ట్రాన్స్‌పోర్టు అధికారులు అంటున్నారు.