సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ 

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ 
  • ఈసారి రూ. 93,750 చెల్లింపు
  • సంస్థ లాభాల్లో 33 శాతం చెల్లించేందుకు ఇప్పటికే  సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం   
  • 42 వేల మంది కార్మికులకు వర్తింపు

కోల్‌బెల్ట్‌, వెలుగు : ప్రతి ఏటా దీపావళికి సింగరేణి  సంస్థ పీఎల్ఆర్‌(పర్ఫార్మెన్స్‌ లింక్డ్‌ రివార్డ్‌) కింద కార్మికులకు ఇచ్చే బోనస్‌ ఈ ఏడాది రూ. 93,750 చెల్లించేందుకు నిర్ణయించారు.  దీంతో సంస్థలోని 42 వేల మంది కార్మికులకు వర్తించనుంది. గత నెల 29న ఢిల్లీలో జాతీయ కార్మిక సంఘాలతో  కోల్ ఇండియా అధికారులు చర్చలు జరిపారు. ఇందులో భాగంగా కార్మికులకు పండుగ బోనస్​గా రూ.లక్ష చెల్లించాలని కార్మిక సంఘాలు పట్టుబట్టాయి. అయితే గతేడాది రూ.85,500 బోనస్ గా ఇచ్చారు.  

కాగా.. ఈసారి  అదనంగా రూ.8,250 కలిపి మొత్తంగా రూ.93,750 చెల్లిస్తామని యాజమాన్యాలు అంగీకరించాయి. దీంతో కార్మికులకు అదనంగా లబ్ధి చేకూరనుంది. కోల్ ఇండియా పరిధిలోని కార్మికులకు దసరా పండుగకు ముందుగానే చెల్లిస్తారు. సింగరేణి కార్మికులకు మాత్రం దీపావళికి ముందు చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది. త్వరలోనే కార్మికులకు బోనస్ చెల్లించే తేదీలను ప్రకటించి వారి ఖాతాల్లో సింగరేణి నగదు జమ చేయనుంది. 

 సింగరేణి లాభాల్లోనూ వాటా చెల్లింపు 

సింగరేణి సంస్థ లాభాల వాటాను కూడా చెల్లించేందుకు యాజమాన్యం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది సంస్థ సాధించిన లాభాల్లో 33 శాతం చెల్లించేందుకు ఇప్పటికే సీఎం రేవంత్​రెడ్డి ఓకే చెప్పారు. దీంతో ఈనెల 7న  కార్మికుల ఖాతాల్లో జమ చేయనున్నారు.  మరోవైపు దసరా పండుగ సందర్భంగా రూ. 25 వేలు పండుగ అడ్వాన్స్​గా కార్మికులకు ఏటా సింగరేణి చెల్లిస్తోంది. అలా ఇచ్చిన సొమ్మును తిరిగి వేతనాల నుంచి ప్రతి నెలా కొంత రికవరీ చేసుకుంటుంది.  వచ్చే నెల వేతనాలతో కలిపి అడ్వాన్స్​కూడా ఇవ్వనుంది.