మార్కెట్ కు దీపావళి జోష్

మార్కెట్​కు రూ.3 వేల కోట్ల బిజినెస్ 
రూ.2 వేల కోట్లు దాటిన గిఫ్ట్ ప్యాక్​ల అమ్మకాలు  
భారీగానే పటాకులు, లిక్కర్ సేల్స్ 
కలిసొచ్చిన మునుగోడు బైపోల్

హైదరాబాద్, వెలుగు : దీపావళి పండుగ మార్కెట్ కు జోష్ తెచ్చింది. గత రెండేండ్లు కరోనా కారణంగా బిజినెస్ పెద్దగా లేని మార్కెట్.. ఈసారి పండుగకు తోడు మునుగోడు ఉప ఎన్నికతో పుంజుకుంది. దీపావళికి వివిధ సంస్థలు, రాజకీయ నాయకులు, అధికారులు స్వీట్స్‌‌, డ్రైఫ్రూట్ బాక్సులను గిఫ్ట్ గా ఇస్తుంటారు. ఈసారి మునుగోడులో పంచేందుకు విaవిధ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున గిఫ్ట్ బాక్సులకు ఆర్డర్ ఇచ్చారు. సాధారణంగా దీపావళికి స్వీట్స్‌‌, డ్రైఫ్రూట్ గిఫ్ట్ బాక్సుల బిజినెస్ రూ.1,500 కోట్ల వరకు ఉంటుందని, కానీ సారి రూ.2 వేల కోట్లు దాటిందని వ్యాపార వర్గాలు తెలిపాయి. ఇక క్రాకర్స్, లిక్కర్ సేల్స్ భారీగానే జరుగుతున్నాయని చెప్పాయి. మొత్తం కలుపుకుంటే దీపావళి బిజినెస్ రూ.3 వేల కోట్ల వరకు ఉంటుందని పేర్కొన్నాయి. 

రెండ్రోజుల్లో రూ.274 కోట్ల లిక్కర్ సేల్స్

దీపావళికి లిక్కర్ సేల్స్ కూడా పెరిగాయి. మద్యం డిపోల నుంచి బార్లు, వైన్స్​కు పెద్ద ఎత్తున స్టాక్ లిఫ్ట్ చేశారు. దీపావళి రోజు రాత్రి చాలామంది పేకాట ఆడతారు. ఈ సందర్భంగా లిక్కర్ ఎక్కువగా తీసుకుంటారు. మద్యం డిపోలకు ఆదివారం సెలవు కావడంతో రెండ్రోజుల ముందే పెద్ద ఎత్తున స్టాక్ లిఫ్ట్ చేశారు. ఈ నెల 21న  రూ.120 కోట్ల లిక్కర్ బార్లు, వైన్స్ లకు పంపించారు. ఇందులో 1.47 లక్షల బీరు కేసులు, 1.24 లక్షల ఐఎంఎల్​కేసులు ఉన్నాయి. ఇక ఈ నెల 22న రూ.154.85 కోట్ల లిక్కర్ లిఫ్ట్ చేశారు. ఇందులో 2.13 లక్షల బీరు కేసులు, 1.50 లక్షల ఐఎంఎల్​ కేసులు ఉన్నాయి. అత్యధికంగా రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో లిక్కర్ సేల్స్ ఎక్కువగా ఉన్నాయి. కాగా, సాధారణంగా మద్యం డిపోల నుంచి రోజూ రూ.80 కోట్ల స్టాక్ లిఫ్ట్ చేస్తారు. 

మునుగోడుకు 2 లక్షల గిఫ్ట్ బాక్సులు  

మునుగోడు ఉప ఎన్నిక దీపావళి జోష్ ను మరింత పెంచింది. దసరా పండుగ సందర్భంగా మందు, మాంసంతో ఓటర్లకు దావత్ లు ఇచ్చిన రాజకీయ పార్టీలు.. దీపావళికి స్వీట్లు, డ్రైఫ్రూట్ గిఫ్ట్ బాక్సులను ఇంటింటికీ పంపిణీ చేస్తున్నాయి. ఇందుకోసం హైదరాబాద్‌‌లోని ప్రముఖ స్వీట్‌‌ హౌస్‌‌లలో 2 లక్షలకు పైగా గిఫ్ట్‌‌ ప్యాక్‌‌లను ఆర్డర్‌‌ చేశాయి. స్వీట్లకు తోడు ప్రజలు పటాకులు కొనుక్కునేందుకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు పార్టీలు పంపిణీ చేస్తున్నాయి.

పెరిగిన క్రాకర్స్ రేట్లు.. 

కరోనా ప్రభావం, సుప్రీంకోర్టు ఆదేశాలతో గత రెండేండ్లలో క్రాకర్స్ బిజినెస్ పెద్దగా జరగలేదు. పటాకుల తయారీలో బేరియం నైట్రేట్ వాడొద్దని సుప్రీం నిషేధం విధించడంతో శివకాశిలో ఉత్పత్తి తగ్గింది. ఈసారి ఎక్కువగా గ్రీన్ క్రాకర్స్ వచ్చాయి. అయితే వాటి ముడిసరుకు ధర ఎక్కువగా ఉండడంతో, క్రాకర్స్ రేట్లు భారీగా ఉన్నాయి. గతేడాది పోలిస్తే 35 నుంచి 40 శాతం పెరిగాయి. పోయినేడు రాకెట్ షాట్స్ బాక్సు రూ.80 నుంచి రూ.130 ఉండగా.. ఇప్పుడు170కి అమ్ముతున్నారు. కాకర పువ్వొత్తులు, పెన్సిల్ క్రాకర్స్ ధర రూ.100 నుంచి రూ.140కి చేరింది. ఉత్పత్తి తగ్గడం, ట్రాన్స్ పోర్టు చార్జీలు పెరగడంతోనూ రేట్లు ఎక్కువయ్యాయని వ్యాపారులు చెబుతున్నారు. రెండేండ్లు పండుగ పెద్దగా జరగకపోవడంతో ఈసారి సేల్స్ బాగానే ఉన్నాయని అంటున్నారు. హైదరాబాద్ క్రాకర్స్​మేళాలో పోయినేడు రూ.95 కోట్ల బిజినెస్ జరగ్గా, ఈసారి  రూ.150 కోట్ల బిజినెస్​ జరుగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు.