దీపావళి అనగానే క్రాకర్స్... లక్ష్మి పూజలు... వెలుగు దివ్వెలే కాదు... నోరూరించే స్వీట్లు కూడా. .. స్నేహితులు, బంధువులు, ఆత్మీయులకు స్వీట్ బాక్స్ ను గిఫ్టుగా ఇస్తుంటారు. దీపావళికి స్వీట్ షాపులు సందడి సందడిగా ఉంటాయి.
నోరూరించే లడ్డూలు.... నోట్లో వేసుకోగానే ... కరిగిపోయే సేమియా పేని, ఆరోగ్యాన్ని అందించే డ్రైఫ్రూట్స్... వెరైటీ స్వీట్లు నోరూరిస్తున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే.. దీపావళికి స్వీట్ల అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయి. వ్యాపారులు కూడా కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా స్వీట్లు తయారుచేస్తూ ఆకర్షిస్తున్నారు. రవ్వలడ్డూలు, బెల్లం కాజు, కాజుబర్ఫీ, పూత రేకులు, డ్రై ఫ్రూట్ పూతరేకులు, రోజ్ పత్తి, కాజు బేక్ స్వీట్స్, పిస్తారోల్, బాదం డేట్స్, డ్రైఫ్రూట్స్ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. కిలోస్వీట్స్ ఆరు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అమ్ముతున్నారు. దీపావళి సమీపిస్తుండటంతో కార్పొరేట్ కంపెనీలతోపాటు కస్టమర్లు స్వీట్ల షాపుల వైపు క్యూ కడుతున్నారు.
Also Read :- బంగారం ధర.. ఒకేసారి ఇంత తగ్గిందేంటయ్యా..!
స్పెషల్ స్వీట్స్
దీపావళి అంటేనే వెలుగుల పండుగ. క్రాకర్స్ తో పాటు స్వీట్లనూ పంచుతూ పండుగను ఉత్సాహంగా జరుపుతుంటారు. రవ్వలడ్డూలు, కాజు బర్ఫీ, కాజు, డ్రైఫ్రూట్స్ అందిస్తూ పండుగను తీపి చేస్తారు. కార్పొరేట్ కంపెనీలు, ప్రైవేట్ సంస్థలు ఎక్కువగా స్వీట్లు కొనుగోలు చేస్తూ ఉద్యోగులకు తీపి పంచుతారు. వ్యాపారులు కస్టమర్ల రుచికి తగ్గట్టుగా స్వీట్లు తయారు చేస్తున్నారు.
ఆకట్టుకునే గిఫ్ట్ బాక్సులు
ఆత్మీయులకు వెరైటీ స్వీట్లే కాదు... గిఫ్ట్ బాక్సులూ ఆకర్షణీయంగా ఉండాలని కోరుకుంటున్నారు చాలామంది. అందుకు తగ్గటే వెరైటీ గిఫ్ట్ బాక్స్ లు మార్కెట్లో లభిస్తున్నాయి. ట్రయాంగిల్, రౌండ్ గిఫ్ట్, ట్రే, జువెలరీ బాక్స్, గ్లాస్ బాటిల్స్, సిల్వర్ కోటేడ్ ట్రేలాంటి గిఫ్టు బాక్సులు ఆకట్టుకుంటున్నాయి. ఈ గిఫ్ట్ బాక్సులను దుబాయ్, రాజస్థాన్, కోల్కత్తాల నుంచి తీసుకొస్తున్నారు. దీపావళి ముందే బుకింగ్ చేసుకుంటున్నారు చాలామంది.