దీపావళి అనగానే టపాసులు గుర్తొస్తాయి. వాటి తర్వాత తియ్యగా టపాసుల్లా పేలే స్వీట్లు కళ్లముందు కదులుతాయి. కానీ.. ఈ మధ్య చాలామంది చక్కెరతో చేసిన స్వీట్స్ తినట్లేదు. అలాగని దీపావళి నాడు నోరు తీపి చేసుకోకపోతే ఎలా? అందుకే ఈ దీపావళి రోజున చక్కెర తినేవాళ్లు, తినని వాళ్లు ఇద్దరూ తినగలిగే హెల్దీ స్వీట్స్ తయారీ ఇచ్చాం. వాటితో తియ్యటి వేడుక చేసుకునేందుకు రెడీ అయిపోండి!
జొన్న అటుకుల లడ్డు
కావాల్సినవి :
జొన్న అటుకులు - నాలుగు కప్పులు
నెయ్యి - ఒక టేబుల్ స్పూన్
ఎండుద్రాక్ష, జీడిపప్పులు - ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్ల చొప్పున
యాలకులు - పది
పచ్చి కొబ్బరి తురుము - ఒకటిన్నర కప్పు
బెల్లం - రెండు కప్పులు
తయారీ : పాన్‌లో జొన్న అటుకులు వేసి నూనె లేకుండా వేగించి ఒక ప్లేట్లోకి తీయాలి. అదే పాన్‌లో నెయ్యి వేడి చేసి ఎండుద్రాక్ష, జీడిపప్పులు వేగించాలి. మిక్సీజార్‌లో వేగించిన జొన్న అటుకులు, యాలకులు వేసి పొడిలా గ్రైండ్ చేయాలి. మిక్సీజార్‌లో పచ్చి కొబ్బరి తురుము, బెల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని అటుకుల మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ఆ తర్వాత అందులో వేగించిన ఎండుద్రాక్ష, జీడిపప్పులు వేసి కలిపి, లడ్డూలు చేయాలి. ఇవి రెండు రోజుల వరకు తాజాగా ఉంటాయి. ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ రోజులు పాడవ్వవు.
డ్రై ఫ్రూట్ మోదక్
కావాల్సినవి :
నెయ్యి - అర టేబుల్ స్పూన్
జీడిపప్పు, బాదం తరుగు, ఎండుద్రాక్ష - ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్ల చొప్పున
గసగసాలు - ఒక టీస్పూన్
కర్జూర తరుగు, పాల పొడి - ఒక్కోటి అర కప్పు చొప్పున
పాలు, కొబ్బరి పొడి - ఒక్కోటి పావు కప్పు చొప్పున
యాలకుల పొడి, ఉప్పు - ఒక్కోటి పావు టీస్పూన్ చొప్పున
నీళ్లు - ఒకటిన్నర కప్పు
బియ్యప్పిండి - ఒక కప్పు
తయారీ : ఒక గిన్నెలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, బాదం తరుగు, ఎండుద్రాక్ష వేగించాలి. తర్వాత గసగసాలు, కర్జూర తరుగు వేసి కలపాలి. మరో పాన్‌లో ఒక టీస్పూన్ నెయ్యి వేడి చేసి అందులో పాలు పోసి కలపాలి. తరువాత పాల పొడి వేసి మిశ్రమం దగ్గరపడేవరకు ఉండలు కట్టకుండా గరిటెతో కలపాలి. ఆ తర్వాత కొబ్బరి పొడి వేయాలి. కాసేపటి తరువాత రెడీ చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ మిశ్రమం, యాలకుల పొడి వేసి అన్ని కలిసేలా బాగా కలపాలి.
మరో గిన్నెలో నీళ్లు వేడి చేసి.. అందులో ఉప్పు, నెయ్యి, బియ్యప్పిండి వేసి ఉండలు కట్టకుండా కలపాలి. గిన్నెమీద మూత పెట్టి ఐదు నిమిషాలు సన్నని మంట మీద ఉడికించాలి. తర్వాత మూత తీసి ఆ మిశ్రమాన్ని వేరే గిన్నెలో వేయాలి. కాస్త వేడిగా ఉన్నప్పుడే పిండిని మెత్తని ముద్దలా కలిపి ఉండలు చేయాలి. ఆ ఉండల్ని చేత్తో అదిమి మోదక్ ఆకారంలో చేసి, లోపల డ్రై ఫ్రూట్స్ మిశ్రమం పెట్టి మూసేయాలి. ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి, ఇడ్లీ ప్లేట్ పై మోదక్‌లు ఉంచి.. పాత్రపై మూతపెట్టి ఆవిరి మీద పది నిమిషాలు ఉడికించాలి.
బాదం పూరి
కావాల్సినవి :
బాదం పప్పులు - పదిహేను
వేడి నీళ్లు - ఒక కప్పు
మైదా, పాలు - పావు కప్పు
బొంబాయి రవ్వ, నెయ్యి - ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్ల చొప్పున
బేకింగ్ పౌడర్, యాలకుల పొడి - ఒక్కోటి పావు టీస్పూన్ చొప్పున
చక్కెర - ఒక కప్పు
ఉప్పు, నీళ్లు - సరిపడా
నిమ్మరసం - అర టీస్పూన్
తయారీ : పాన్‌లో చక్కెర వేసి, నీళ్లు పోయాలి. అందులో కుంకుమ పువ్వు వేయాలి. లేత పాకం వచ్చాక, నిమ్మరసం, యాలకుల పొడి వేసి కలిపి, మూత పెట్టి పక్కన పెట్టాలి. ఒక గిన్నెలో వేడి నీళ్లు పోసి, బాదం పప్పులు వేసి అరగంట నానబెట్టాలి. తర్వాత దానిపై తొక్క తీయాలి. మిక్సీలో వేసి పావు కప్పు నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఒక గిన్నెలో మైదా, జల్లెడ పట్టిన బొంబాయి రవ్వ, బేకింగ్ పౌడర్, ఉప్పు, ఒక టీస్పూన్ చక్కెర, నెయ్యి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత అందులో బాదం పేస్ట్ వేసి, పాలు పోసి ముద్దగా కలపాలి. ఆపై నూనె రాసి కాసేపు పక్కన ఉంచాలి. తర్వాత దాన్ని చిన్న ఉండలు చేసి, పూరీల్లా వత్తాలి. ఆ పూరిని సమోసా షేప్‌లా మడతలు వేస్తూ వత్తాలి. మధ్యలో లవంగం గుచ్చి, నూనెలో వేగించాలి. వేగిన బాదం పూరీ చల్లారాక పాకంలో వేయాలి.
మిల్లెట్ గ్రనోలా
కావాల్సినవి :
జొన్న అటుకులు - రెండు కప్పులు
పల్లీలు - అర కప్పు
బాదం, జీడిపప్పు తరుగు - పావు కప్పు
గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు గింజలు, నువ్వులు - ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున
ఉప్పు - పావు టీస్పూన్
బెల్లం లేత పాకం లేదా మాపెల్ సిరప్ - పావు కప్పు
కొబ్బరి నూనె - రెండు టేబుల్ స్పూన్లు
వెనిలా ఎక్స్ట్రాక్ట్ - ఒక టేబుల్ స్పూన్
దాల్చిన చెక్క పొడి - అర టీస్పూన్
ఎండుద్రాక్ష, నలుపు ఎండుద్రాక్ష - ఒక్కోటి అర కప్పు చొప్పున
తయారీ : ఒక గిన్నెలో జొన్న అటుకులు, బాదం, జీడిపప్పు తరుగు, గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు గింజలు, నువ్వులు, ఉప్పు వేయాలి. అందులో బెల్లం పాకం లేదా మాపెల్ సిరప్, కొబ్బరి నూనె, వెనిలా ఎక్స్ట్రాక్ట్, దాల్చిన చెక్క పొడి వేసి కలపాలి. ఒక ట్రేలో పేపర్ వేసి దానిపై ఈ మిశ్రమాన్ని ట్రే అంతటా స్పూన్‌తో పరవాలి. ఆ ట్రేని ప్రీహీటెడ్ ఒవెన్‌లో పెట్టి దాదాపు అరగంట పాటు ఉంచాలి. దాన్ని బయటకు తీశాక అందులో పసుపు, నలుపు రంగుల కిస్మిస్లు కూడా కలపాలి. ఈ మిక్చర్ చల్లారాక ఒక గ్లాస్ జార్లో వేసి మూత పెడితే రెండు నెలలు పాడు కాదు. దీన్ని రోజుకు ఒక స్పూన్ తినడం హెల్దీ.
బ్రెడ్ గులాబ్ జామూన్
కావాల్సినవి :
బ్రెడ్ ముక్కలు - పది
పాలు - అర కప్పు
నెయ్యి - ఒక టేబుల్ స్పూన్
చక్కెర, నీళ్లు - ఒక్కో కప్పు చొప్పున
యాలకుల పొడి - ఒక టీస్పూన్
తయారీ : ఒక గిన్నెలో చక్కెర వేసి, నీళ్లు పోసి కరిగించాలి. ఆపై యాలకుల పొడి, నిమ్మరసం వేసి కలపాలి. బ్రెడ్ ముక్కల చుట్టూ ఉన్న క్రస్ట్‌ను తీసేయాలి. ఆ తర్వాత బ్రెడ్ ముక్కల్ని తుంచి, మిక్సీజార్‌లో వేసి పొడిలా గ్రైండ్ చేయాలి. ఆ పొడిని ఒక గిన్నెలో వేసి అందులో పాలు పోస్తూ కలపాలి. అందులో నెయ్యి కూడా వేసి బాగా కలిపి ముద్ద చేయాలి. ఆ ముద్దలో కొంచెంకొంచెం పిండిని తీసుకుని గోలీ సైజు ఉండలు చేయాలి. ఆ ఉండల్ని నూనెలో వేగించాలి. ఆ తర్వాత వాటిని పాకంలో వేసి కాసేపు ఉంచితే.. నోరూరించే బ్రెడ్ గులాబ్ జామూన్ తినేయడమే.