19 ఏండ్ల కుర్రాడి చేతిలో జొకోవిచ్‌‌‌‌ ఓటమి.. మియామి ఓపెన్ టైటిల్ నెగ్గిన జాకబ్ మెన్సిక్

19 ఏండ్ల కుర్రాడి చేతిలో జొకోవిచ్‌‌‌‌ ఓటమి.. మియామి ఓపెన్ టైటిల్ నెగ్గిన  జాకబ్ మెన్సిక్

మియామి గార్డెన్స్‌‌‌‌: కెరీర్‌‌‌‌‌‌‌‌లో వందో టైటిల్‌‌‌‌పై గురిపెట్టిన టెన్నిస్ లెజెండ్ నొవాక్ జొకోవిచ్‌‌‌‌కు షాక్‌‌‌‌.  మియామి ఓపెన్ మెన్స్ సింగిల్స్‌‌‌‌ ఫైనల్లో 19 ఏండ్ల చెక్ రిపబ్లిక్ కుర్రాడు జాకబ్‌ మెన్సిక్ చేతిలో నొవాక్ అనూహ్యంగా ఓడిపోయాడు. సోమవారం జరిగిన టైటిల్ ఫైట్‌‌‌‌లో మెన్సిక్ 7-–6 (7/4), 7–-6 (7/4) తేడాతో 37 ఏండ్ల జొకోపై సంచలన విజయం సాధించి తన కెరీర్‌‌‌‌‌‌‌‌లో తొలి ఏటీపీ టైటిల్‌‌‌‌ కైవసం చేసుకున్నాడు. 

ఫైనల్లో జొకో వరుస ఇబ్బందులకు గురయ్యాడు. తొలుత వర్షం కారణంగా ఆట ఏకంగా ఐదున్నర గంటలు ఆలస్యంగా మొదలవడం జొకోవిచ్ రిథమ్‌‌‌‌ను దెబ్బతీసింది. మధ్యలో కంటి ఇన్‌‌‌‌ఫెక్షన్‌‌‌‌తో అసౌకర్యానికి గురయ్యాడు. రెండు సార్లు ఐ డ్రాప్స్ వేయించుకోవాల్సి వచ్చింది.  ఇక- గ్రౌండ్‌‌‌‌ తడిగా ఉండటంతో జొకోవిచ్ రెండుసార్లు జారిపడ్డాడు. ఇవన్నీ తన ఆటపై ప్రభావం చూపెట్టాయి. 

మరోవైపు ప్రపంచంలోనే మేటి ఆటగాడితో  తన కెరీర్‌‌‌‌‌‌‌‌లో తొలి ఫైనల్లో మెన్సిక్ అదరగొట్టాడు. పదునైన సర్వీస్‌లతో జొకోను ఇబ్బంది పెట్టిన అతను మ్యాచ్‌‌‌‌  మొత్తంలో 14 ఏస్‌లు కొట్టాడు.   మ్యాచ్ ముగిసిన తర్వాత అద్భుతంగా ఆడాడంటూ అతనిపై జొకోవిచ్ పొగత్తల వర్షం కురిపించాడు. మరెన్నో టైటిల్స్ నెగ్గే సత్తా  మెన్సిక్‌‌‌‌కు ఉందన్నాడు.