
- మూడో రౌండ్‌లోకి ప్రవేశం
పారిస్: సెర్బియా టెన్నిస్ లెజెండ్ నొవాక్ జొకోవిచ్.. ఫ్రెంచ్ ఓపెన్‌లో మరో అడుగు ముందుకేశాడు. గురువారం జరిగిన మెన్స్ సింగిల్స్ రెండో రౌండ్‌లో టాప్‌సీడ్ జొకో 6–4, 6–1, 6–2తో రాబర్టో కార్బల్స్ బేనా (స్పెయిన్)పై గెలిచి మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. దీంతో ఆల్‌టైమ్ గ్రాండ్ స్లామ్ సింగిల్స్‌లో 367వ విజయంతో సెరెనా విలియమ్స్ రికార్డును సమం చేశాడు. అలాగే రొలాండ్ గారోస్‌లో 94వ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. 2 గంటలా 4 నిమిషాల మ్యాచ్‌లో జొకో పూర్తి ఆధిపత్యం చూపెట్టాడు. 5 ఏస్‌లు కొట్టిన అతను ఒక డబుల్ ఫాల్ట్ చేశాడు.
12 బ్రేక్ పాయింట్లలో ఏడింటిని కాచుకున్నాడు. 24 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్ చేసిన జొకో 77 శాతం నెట్ పాయింట్స్‌ను సాధించాడు. ఇతర మ్యాచ్‌ల్లో డానియెల్ మెద్వెదెవ్ (రష్యా) 6–1, 5–0తో మియోమిర్ కెమనోవిచ్ (సెర్బియా)పై, నాలుగోసీడ్ జ్వరెవ్ (జర్మనీ) 7–6 (7/4), 6–2, 6–2తో డేవిడ్ గొఫిన్ (బెల్జియం)పై, హుర్కాజ్ (పోలెండ్) 6–7 (2/7), 6–1, 6–3, 7–6 (7/5)తో బ్రాండన్ నకషిమా (అమెరికా)పై, పదోసీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) 6–0, 6–3, 6–4తో ఫ్యాబియన్ మర్జోసాన్ (హంగేరి)పై నెగ్గారు.
విమెన్స్ సింగిల్స్ రెండో రౌండ్‌లో రెండో సీడ్ అరీనా సబలెంక (రష్యా) 6–2, 6–2తో మయుకా ఉచిజిమా (జపాన్)పై, నాలుగోసీడ్ రిబకిన (కజకిస్తాన్) 6–3, 6–4తో అరంటాక్స్ రుస్ (నెదర్లాండ్స్)పై, స్వితోలినా (ఉక్రెయిన్) 6–4, 7–6 (7/3)తో డియానె పర్రీ (ఫ్రాన్స్)పై గెలిచి మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టారు.