- ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వరద నష్టాలు
- బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ
నిజామాబాద్ అర్బన్/ కామారెడ్డి/ మోర్తాడ్, వెలుగు : ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహా ఆ పార్టీ లీడర్లు, ప్రజాప్రతినిధులు కమీషన్ల కక్కుర్తి కోసమే పని చేస్తున్నారని బీజీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. ఆదివారం ఆమె ఉమ్మడి నిజామాబాద్జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అనంతరం జిల్లా కేంద్రం నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం చెబుతున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, కాలువల ఆధునీకరణ తదితర పనుల్లో విపరీతమైన అవినీతి జరిగిందని, అధికార పార్టీ లీడర్లు ప్రతీ పనిలో కమీషన్లు తీసుకొని నాసిరకం పనులు చేయించారని ఆరోపించారు. ఫలితంగానే ఇటీవల కురిసిన వర్షాలకు చెరువుకట్టలు తెగిపోయాయని, చెక్‌డ్యాంలు ధ్వంసమయ్యాయన్నారు. సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న వేల్పూర్ మండలం మోతెలోని రైతులు నిండా మునిగారని, అప్పుడు గ్రామంలోని మట్టిని ముడుపు కట్టిన సీఎం కేసీఆర్ఇప్పుడు కన్నెత్తి కూడా చూడడం లేదన్నారు.
జిల్లా మంత్రి ప్రశాంత్‌రెడ్డి సొంత మండలం వేల్పూర్‌లో సైతం వరద నష్టాన్ని నివారించడంలో విఫలమయ్యారని, కమీషన్ల కక్కుర్తితో జరిగిన నాసిరకం పనులే నష్టానికి మూలమని ధ్వజమెత్తారు. రైతుబంధు పేరిట ఏకరానికి రూ.10 వేలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందన్నారు. గతంలో అతివృష్టితో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల ఇస్తామని ప్రకటించిన కేసీఆర్, ఆ తర్వాత ఆ మాటే మరిచిపోయారని పదిపైసలు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. రాష్ట్రంలో ఫసల్‌బీమా అమల్లో ఉంటే రైతులకు నష్టపరిహారం అందేదన్నారు. స్టేట్ క్యాబినెట్ మీటింగ్‌లో భారీ వర్షాలతో జరిగిన నష్టంపై చర్చించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ జిల్లాధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ, మోహన్‌రెడ్డి, దినేశ్ పాల్గొన్నారు.