- సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్ రెడ్డి
పాలమూరు, వెలుగు: డీకే అరుణ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు టీపీసీసీ నాయకుల సమక్షంలో రూ. 15 కోట్లు ఇస్తే కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీచేయడానికి సిద్ధమని చెప్పిన విషయం నిజం కాదా అని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్ రెడ్డి అన్నారు. ఆమె రాముడి పేరుతో రాజకీయం చేయడం మానుకోవాలని హితువు పలికారు. నియోజకవర్గ కార్యకర్తల విస్తృత సమావేశం మహబూబ్‌నగర్‌లో బుధవారం ప్రైవేటు పంక్షన్లో జరిగింది.
ముఖ్య అతిథిగా పాల్గొన్న వంశీచందర్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో జరిగిన లోకసభ ఎన్నికల్లో అప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడిన ఎమ్మెల్యే అభ్యర్థులు, ఇతర నాయకులు పార్టీని వీడినా ప్రతికూల పరిస్థితుల్లో పోటీ చేశానని తెలిపారు. కార్యకర్తలు ఎంతో కష్టపడే పనిచేశారని, వారి పనితీరును స్వయంగా చూశానన్నారు. ఇక్కడ ఎంపీతోపాటు రాష్ట్రంలోని ఎక్కువ ఎంపీలను గెలిచి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడంలో కీలక పాత్ర పోషించాలన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి రూ.15 కోట్ల మినీ క్రికెట్ స్టేడియం నిర్మాణం కోసం బీసీసీఐ హామీ ఇచ్చినట్లు తెలిపారు. పార్లెజీ కంపెనీ రూ.వెయ్యి కోట్లతో దేశంలో రెండో ఉత్పత్తి కేంద్రాన్ని మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేయడానికి ఒప్పుకుందన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే బీఆర్‌ఎస్ పార్టీ భూస్థాపితమవుతుందన్నారు. కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు