కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయాలి

కాంట్రాక్ట్  లెక్చరర్లను రెగ్యులరైజ్  చేయాలి

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: జీవో 21ని రద్దు చేసి కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్  చేయాలని మహబూబ్​నగర్  ఎంపీ డీకే అరుణ డిమాండ్  చేశారు. శనివారం పీయూలో కాంట్రాక్ట్​ లెక్చరర్ల దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 12 యూనివర్సిటీల్లో ధర్నాలు చేపట్టడం బాధాకరమని పేర్కొన్నారు. 

న్యాయమైన డిమాండ్ల కోసం ధర్నాలు చేస్తుంటే అరెస్టు చేయడం సరైంది కాదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంట్రాక్ట్​ లెక్చరర్ల గురించి మాట్లాడి, సీఎం కాగానే మర్చిపోయారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, 1,200 మంది కాంట్రాక్ట్​ లెక్చరర్లను వెంటనే రెగ్యులరైజ్  చేయాలన్నారు. యూజీసీ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతానని తెలిపారు.

ఎంపీకి ఏబీవీపీ వినతి..

పీయూలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏబీవీపీ నాయకులు ఎంపీ డీకే  అరుణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నరేశ్​ తేజ మాట్లాడుతూ కొత్తగా మంజూరైన లా, ఇంజనీరింగ్  కాలేజీలకు సౌలతులు కల్పించాలని, వసతిగృహాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. హెల్త్  సెంటర్​లో రెగ్యులర్  డాక్టర్ ను నియమించాలని, కొత్త అంబులెన్స్  మంజూరు చేయాలని కోరారు. యూనివర్సిటీ గేట్  ముందు బస్  స్టాప్  ఏర్పాటు చేయాలన్నారు. అర్జున్ కుమార్, కృష్ణ కుమార్, నగేశ్, సంగీత, తిరుమలేశ్  పాల్గొన్నారు.