నోరు అదుపులో పెట్టుకోవాలి: మంత్రి సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన డీకే అరుణ

నోరు అదుపులో పెట్టుకోవాలి: మంత్రి సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన డీకే అరుణ

హైదరాబాద్: యాక్టర్స్ నాగచైతన్య, సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ హాట్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై బీజేపీ నాయకురాలు, ఎంపీ డీకే అరుణ స్పందించారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ఇవాళ (అక్టోబర్ 4) బీజేపీ నేతృత్వంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీకే అరుణ మాట్లాడుతూ.. కొండా సురేఖ వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు. ‘‘మంత్రి కొండా సురేఖతో నాకు మంచి అనుబంధం ఉంది.

 గతంలో ఇద్దరం కలిసి మంత్రులుగా పనిచేశాం. కానీ రాజకీయంగా అక్కినేని కుటుంబంపై ఆమె చేసిన ఆరోపణలు అభ్యంతకరంగా ఉన్నాయి’’ అని అన్నారు. 
సినిమా ఇండ్రస్టీలో అక్కినేని ఫ్యామిలీకి ప్రత్యేక పేరు ఉందని.. అలాంటి కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఎవరి వ్యక్తిగత విషయాలనైనా రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదని.. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు. 

ఒకసారి మాట్లాడిన తర్వాత మళ్లీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటామంటే కుదరదని.. రాజకీయ నాయకులు ఆవేశం వచ్చినా ఆలోచించి మాట్లాడాలని సూచించారు. ఒకరి మీద కోపం ఇంకొకరి మీద తీయడం  సరికాదని అన్నారు. ఇక, అమ్మవారి ఆలయం దగ్గర మహిళలు బతుకమ్మ ఆడటానికి కూడా కోర్ట్ పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చిందని.. తెలంగాణలో మళ్లీ నియంతృత్వ పాలన సాగుతుందని ఫైర్ అయ్యారు. హిందువు పండగలపై వివక్ష చూపి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆగ్రహానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురి కావొద్దని హెచ్చరించారు.