పసుపు రైతుల కల నెరవేర్చిన ఘనత మోదీదే : డీకే అరుణ

పసుపు రైతుల కల నెరవేర్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కిందన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. పసుపు రైతుల పక్షాన మోడీకి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వని కారణంగానే ములుగులో గిరిజన యూనివర్శిటీ అలస్యం అయ్యిందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ద్వారా మహిళలకు రాజకీయాల్లో సమాన హక్కులు కల్పించిన వ్యక్తి మోదీయే అన్నారు. తెలంగాణ అమరవీరుల సమాధులు మీద కేసీఆర్ పదవి అనుభవిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ తన రాజకీయ లబ్ది కోసం యువకుల ప్రాణాలు పోవటానికి కారణమయ్యారని ఆరోపించారు. ఇందూరు జన గర్జన సభలో డీకే అరుణ ఈ కామెంట్స్ చేశారు. 

నిరుద్యోగ భృతి ఇవ్వని కేసీఆర్ కు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు డీకే అరుణ. ప్రధాని మోదీ ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చారని చెప్పారు. కోవిడ్ లో దేశ ప్రజలకు, ప్రపంచానికి ధైర్యం కల్పించిన గొప్ప వ్యక్తి మోదీ అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే మాట్లాడుతారని అన్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా గురించి మాట్లాడే హక్కు కేసీఆర్ కు లేదన్నారు. కేసీఆర్ వి చిల్లర రాజకీయాలన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే అని, లోపాయకారి ఒప్పందంతో అవి కలిసి పని చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు.