మహబూబ్ నగర్ అర్బన్: కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ లో భాగంగా ఆదివారం కాచిగూడ నుంచి యశ్వంత్ పూర్ (బెంగళూర్) వరకు వందే భారత్ రైలును ప్రారంభించింది. మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ లో రైలును బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ , జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వందే భారత్ రైలు పాలమూరు ప్రజలకు మోదీ ఇచ్చిన ఒక వరమన్నారు. ఇక్కడి ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగు పడుతుందని ఆకాంక్షించారు. ఈ రైలు వారంలో బుధవారం తప్ప అన్ని రోజులు వెళ్తుందని రైల్వే అధికారులు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు వీర బ్రహ్మచారి, కౌన్సిలర్ రామాంజనేయులు, కిరణ్ కుమార్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
గద్వాలలో వందే భారత్ ట్రైన్ ఆగేటట్లు చేస్తా
గద్వాల, వెలుగు: హైదరాబాద్, బెంగళూరు మధ్య నడిచే వందే భారత్ ట్రైన్ ను గద్వాలలో ఆగేటట్లు కృషి చేస్తానని- బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం మహబూబ్ నగర్ నుంచి వందే భారత్ ట్రైన్ లో ఆమె గద్వాల వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల ట్రైన్ గద్వాలలో ఆగడం లేదన్నారు. ఇదివరకే ఈ విషయాన్ని రైల్వే ఆఫీసర్లకు తెలిపామన్నారు. వందే భారత్ ట్రైన్ లో ప్రయాణం విమానంలో చేసినట్లు ఉంటుందన్నారు. కార్యక్రమంలో బండల పద్మావతి, రజక జయ శ్రీ తదితరులు పాల్గొన్నారు.