హైదరాబాద్, వెలుగు : వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్చడానికి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన.. అని చెప్తున్న సీఎం కేసీఆర్, సెంటర్కు పంపిన తీర్మానం బయటపెట్టాలని బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ డిమాండ్ చేశారు. పాలమూరు టూర్ కి వచ్చి కేసీఆర్ అన్ని అబద్ధాలు మాట్లాడారని ఆదివారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో మండిపడ్డారు. 8ఏండ్ల నుంచి పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయకుండా, రీ డిజైన్ పేరుతో కమీషన్లకు అలవాటుపడి లక్షల కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు.
కృష్ణా జలాల విషయంలో ఏపీ సీఎంతో లాలూచీపడి తెలంగాణ వాటాను అమ్ముకున్నారని ఆరోపించారు. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనలేని కేసీఆర్.. కేంద్రం అడ్డంకులు పెడుతుందని చెప్పి బీజేపీ జాతీయ నాయకత్వాన్ని బద్నాం చేసే కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తన కుటుంబ సభ్యులను అవినీతి కేసుల నుంచి ఎలా తప్పించాలనే ఆలోచనలో సీఎం ఉన్నారని విమర్శించారు. అవినీతికి పాల్పడితే సొంత బిడ్డను కూడా విడిచిపెట్టనని స్వయంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పిన కేసీఆర్.. కవిత విషయంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు.