గద్వాల, వెలుగు : దేశాన్ని ప్రధాని మోదీ ప్రపంచ స్థాయిలో నిలబెట్టారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు. సోమవారం గద్వాలలోని తన ఇంటిలో మీడియాతో మాట్లాడుతూ వందే భారత్ రైలు, పైప్ లైన్ ద్వారా గ్యాస్ సప్లై, దేశ సరిహద్దుల్లో అభివృద్ధితో ప్రపంచ దేశాల మన్నలను పొందారన్నారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చడం బీజేపీతోనే సాధ్యమన్నారు. గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, 40 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారన్నారు.
ఉద్యోగులకు జీతాలు రాక, పెన్షనర్లకు ఇన్ టైంలో పెన్షన్ ఇవ్వలేని విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మారిందన్నారు. పాలమూరులో జరిగిన ప్రజా గర్జన సభను సక్సెస్ చేసిన వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. మోడీ ప్రకటించిన పథకాలతో ఉమ్మడి పాలమూరు జిల్లాకు మేలు జరుగుతుందన్నారు. గడ్డం కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, రాముడు, రాధాకృష్ణారెడ్డి అనిమిరెడ్డి, ఎర్ర భీమిరెడ్డి, పెద్ద కృష్ణ పాల్గొన్నారు. అంతకుముందు ధరూర్ మండల కేంద్రంలోని దళితవాడలో సహపంక్తి భోజనం చేశారు.